ముంబై, అక్టోబర్ 30 : దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 80 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం మార్కెట్లో సెంటిమెంట్‌ను నిరుత్సాహపరిచింది. 80,435 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 426.85 పాయింట్ల నష్టంతో 79,942.18 వద్ద ముగిసింది. అటు మరో సూచీ నిఫ్టీ సైతం 126 పాయింట్లు కోల్పోయి 24,340.85 వద్ద నిలిచింది.