Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపునకు సమయం ఆసన్నమైందని జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియంలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించాలన్న నిర్ణయం దాదాపు ఖరారైంది. ఇదే జరిగితే గత నాలుగేళ్లలో వడ్డీరేట్ల కోత ఇదే తొలిసారి కానున్నది. యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెంచవచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లలో అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఫైనాన్షియల్, ఐటీ స్టాక్ రాణించడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి.
క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ పాయింట్ల వద్ద 81,388.26 వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,824.27 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 611.90 పాయింట్ల లాభంతో వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 187.40 పాయింట్లు పెరిగి 25,010.60 వద్ద ముగిసింది. దాదాపు 2,075 షేర్లు పెరగ్గా.. మరో 1,791 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో హిందాల్కో, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఒఎన్టీసీ లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ పతనమయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్ మినహా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ ఒకశాతం నుంచి రెండుశాతం వృద్ధితో అన్నిరంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2శాతం చొప్పున పెరిగాయి.