Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆటో దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించడంతో మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు కనిపించాయి. ఆటో, ఫార్మా, టెలికాం షేర్లు సహా మిగతా అన్నిరంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 77,087.39 పాయింట్ల వద్ద నష్టాల్లోనే మొదలైంది. ఇంట్రాడేలో 77,082.51 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్.. గరిష్ఠంగా 77,747.46 పాయింట్లకు పెరిగింది. చివరలో 317.93 లాభంతో 77,606.43 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 105.10 పాయింట్లు లాభపడి 23,591.95 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం వృద్ధిని నమోదు చేసింది. ట్రంప్ టారిఫ్‌లపై అనిశ్చితి కారణంగా ఫార్మా స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి. ఆటో ఒకశాతం తగ్గగా.. ఫార్మా 0.4శాతం పతనమైంది. ఇక మిగతా అన్నిరంగాల సూచీలు పెరిగాయి. మీడియా, చమురు, గ్యాస్, రియాల్టీ ఒక్కొక్కటి ఒక శాతం వరకు పెరిగాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ లాభాలను ఆర్జించగా.. టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి. సోనా బీఎల్డబ్ల్యూ, హ్యాపీయెస్ట్ మైండ్స్, మెట్రో బ్రాండ్స్, మహీంద్రా లైఫ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, జెన్సోల్ ఇంజినీరింగ్, వక్రంగీ, టీసీఐ ఎక్స్‌ప్రెస్, శివ సిమెంట్, రోలెక్స్ రింగ్స్, ఎక్స్‌ప్లియో సొల్యూషన్, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్, సుయోగ్ టెలి, గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ తదితర 460 స్టాక్‌లు బీఎస్ఈలో 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.