Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనంతో పాటు అమ్మకాల ఒత్తిడితో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మెటల్, పీఎస్యూలో అమ్మకాలు కనిపించాయి. అదే సమయంలో చివరి సెషన్లో సూచీలు అమ్మకాలతో పతనమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 78,707.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,877.36 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 78,397.79కి తగ్గింది. చివరకు 67.30 పాయింట్ల నష్టంతో 78,472.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.80 పాయింట్లు తగ్గి.. 23,727.65 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,907 షేర్లు లాభాల్లో సాగగా.. మరో 1,926 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ నష్టాల్లో కొనసాగాయి. టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, ఐటీసీ లాభాల్లో కొనసాగాయి. సెక్టార్లలో ఆటో, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్‌లలో భారీగా అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. ఇక క్రిస్మస్ సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. గురువారం మళ్లీ యథావిధిగా కొనసాగనున్నాయి.