Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, బ్లూ చిప్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ పాయింట్ల వద్ద 80,529.20 లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,244.78 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 80,949.10 వరకు పెరిగింది. చివరకు 597.67 పాయింట్ల లాభంతో 80,845.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 181.10 పాయింట్లు పెరిగి.. 24,457.15 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,647 షేర్లు పురోగమించగా.. 1,190 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ టాప్ గెయినర్స్ నిలిచాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్ఎంసీజీ మినహా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి రెండు శాతానికిపైగా పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కో శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి.