Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25లో వృద్ధి అంచనాలను 7.2శాతం నుంచి 6.6శాతానికి తగ్గించింది. అలాగే, ద్రవ్యోల్బణం అంచనాలను 4.5శాతం నుంచి 4.8శాతం శాతానికి పెంచింది. ఈ క్రమంలో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,602.58 వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మళ్లీ లాభాలబాటలో పట్టినా చివరకు పతనమయ్యాయి. ఒక దశలో 81,783.28 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,411.55 పాయింట్లకు తగ్గింది. చివరకు 200.66 పాయింట్ల నష్టంతో 81,508.46 వద్ద ముగిసింది.
నిఫ్టీ 58.80 పాయింట్లు తగ్గి.. 24,619.00 వద్ద ముగిసింది. దాదాపు 2,222 షేర్లు పురోగమించగా.. 1,692 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ నష్టపోయిన వాటిలో టాటా కన్స్యూమర్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా ఉన్నాయి. ఎల్అండ్టీ, విప్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపీసీఎల్, టాటా స్టీల్ లాభపడ్డాయి. సెక్టార్లలో ఎఫ్ఎంసీజీ, మీడియారంగాల షేర్లు 2శాతం చొప్పున, ఫార్మా, పీఎస్‌యు బ్యాంక్, ఆటో, ఎనర్జీ 0.5 శాతం చొప్పున పతనమయ్యాయి. మెటల్ ఇండెక్స్ 0.6 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.