Stock Market | రెండురోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ రాణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో పాటు మరికొన్ని దేశాలపై సుంకాలు ప్రకటించనునున్న నేపథ్యంలోనూ ర్యాలీ కొనసాగడం విశేషం. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 76,146.28 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 76,064.94 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 76,680.35 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 592.93 పాయింట్లు పెరిగి 76,617.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 166.65 పెరిగి 23,332.35 వద్ద స్థిరపడింది. దాదాపు 2755 షేర్లు లాభపడగా.. 1,048 పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్ ప్లాన్ ప్రకటించ తర్వాత ప్రపంచ వాణిజ్యం మొత్తం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ టారిఫ్ ప్లాన్ల రూపురేఖలు ఎలా ఉంటాయో చూడాల్సిందేనని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మనకు ఇబ్బందికరంగా మారింతే తిరోగమనాన్ని చూడాల్సి వస్తుందని.. ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బాగ్లా పేర్కొన్నారు. రంగాలవారీగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, బ్యాంక్, ఐటీ, ఆటో ఏప్రిల్ షేర్లు ఒకశాతం వరకు పెరిగాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ ఒకశాతంపైగా పెరిగాయి. నిఫ్టీ ఇన్ఫ్రా, మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ కూడా అదే బాటలో కొనసాగాయి. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జొమాటో (ఎటర్నల్), టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్ప్, నెస్లే, హిందాల్కో షేర్లు నష్టపోయాయి.