Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఆరు రోజుల నష్టాలను అధిగమించి వృద్ధిని నమోదు చేశాయి. ఇవాళ ఉదయం హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు ప్రారంభంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మార్కెట్లో లాభాల్లో పయనించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే 80,826.56 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 81,763.28 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
చివరకు 584.81 పాయింట్ల లాభంతో 81,634.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 217.40 పెరిగి.. 25,013.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,884 షేర్లు పురోగమించగా.. 895 షేర్లు పతమయ్యాయి. నిఫ్టీలో ట్రెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. టాటా స్టీల్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, జెడబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి. మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పవర్, టెలికాం, మీడియా ఒకశాతం నుంచి రెండుశాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 2శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం పెరిగింది.