Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, రియల్టీ స్టాక్స్ కొనుగోళ్లతో మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,036.22 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా పడిపోయింది. తిరిగి కోలుకొని చివరకు లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 80,630.53 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 81,245.39 పాయింట్ల వరకు పెరిగింది. చివరకు 110.58 పాయింట్ల లాభంతో 80,956.33 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 10.30 పాయింట్లు పెరిగి 24,467.45 వద్ద ముగిసింది.
ట్రేండింగ్లో దాదాపు 2,307 షేర్లు పురోగమించగా, 1,507 షేర్లు పతనమయ్యాయి. మరో 95 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. భారతీ ఎయిర్టెల్, సిప్లా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో ఆటో, ఎఫ్ఎంసీసీ ఒక్కొక్కటి 0.7శాతం క్షీణించగా.. ఐటీ, మీడియా ఒక్కొక్కటి 0.5 శాతం, రియాల్టీ, పీయూఎస్ బ్యాంక్ రంగాల షేర్లు 2శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది.