బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 02, 2020 , 23:41:11

ప్రారంభ లాభాలు ఆవిరి

ప్రారంభ లాభాలు ఆవిరి
  • సెన్సెక్స్‌ 153, నిఫ్టీ 69 పాయింట్ల నష్టం
  • చివరి గంటలో అమ్మకాలు

ముంబై, మార్చి 2: ఉదయం 9.15 గంటలు..యథాతథంగా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన నిమిషంలోనే 750 పాయింట్లకు పైగా దూసుకుపోవడంతో మదుపరుల సంపద అమాంతం రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మధ్యాహ్నం వరకు జోరుగా కొనసాగిన సూచీలకు ఆ తర్వాత అనుకొని షాక్‌ తగిలింది. చైనాను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌కు కూడా అంటుకుందన్న వార్తలు మదుపరులను ఆందోళనకు గురిచేసింది. ఫలితంగా అప్పటి వరకు కొనుగోళ్లకు మొగ్గుచూపిన దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు ఆ తర్వాత అమ్మకాలకు పాల్పడ్డారు.  గత వారంలో ఏకంగా 3 వేల పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు ఈవారం ప్రారంభంలోనే కరోనా వైరస్‌ భారీ లాభాలకు బ్రేక్‌వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా తోడవడంతో ఈ పతనానికి ఆజ్యంపోసింది. ఒక దశలో 785 పాయింట్లకు పైగా లాభపడిన సూచీలు చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో నష్టాల్లో కూరుకుపోయింది. వరుసగా ఏడోరోజు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 153.27 పాయింట్లు పతనం చెంది 38,144.02 వద్ద ముగిసింది. 400 పాయింట్ల స్థాయిలో కదలాడిన జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ చివరకు 69 పాయింట్లు కోల్పోయి 11,132.75 వద్ద స్థిరపడింది. 


రూపాయి ఢమాల్‌

రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. ప్రారంభంలో లా భపడిన మారకం విలువ చివరకు భారీగా నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 52 పైసలు పడిపోయి 72.76 వద్ద ముగిసింది. 72.78 కనిష్ఠ స్థాయికి జారుకున్న రూపాయి విలువ చివరకు 72.76 వద్ద ముగిసింది. తీవ్ర ఒడిదుడుకులకు లోనైన రూపాయి విలువ ఆసియాలోని కరెన్సీల్లో ఒక్క టే నష్టపోయిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. 


కరోనా ముంచింది..

భారత్‌లో రెండు కరోనా వైరస్‌ కేసులు నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడం మార్కెట్లో ప్రకంపనాలు సృష్టించింది. అప్పటి వరకు భారీ లాభాల్లో కొనసాగిన సూచీలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ అధినేత వినోద్‌ తెలిపారు. రంగాలవారీగా చూస్తే మెటల్‌, చమురు అండ్‌ గ్యాస్‌, బేసిక్‌ మేటిరియరల్‌, యుటిలిటీ, ఎనర్జీ, టెలికం రంగ షేర్లు రెండు శాతానికి పైగా పతనమవగా.... టెక్‌, ఐటీ రంగ షేర్లు మాత్రం మదుపరులను ఆకట్టుకున్నాయి. ఎస్బీఐ, టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌,  షేర్లు నష్టపోగా.. హెచ్‌సీఎల్‌, నెస్లె, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌లు లాభాల్లో ముగిశాయి.
logo