ముంబై, డిసెంబర్ 11: భారత్ ప్రధాన స్టాక్ సూచీల్లో ఒకటైన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 70,000 పాయింట్ల స్థాయిని చేరింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 70,057 నూతన రికార్డుస్థాయికి చేరింది. తదుపరి కొంత లాభాల స్వీకరణ కారణంగా 70 వేల స్థాయికి కాస్త దిగువన 69.928 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచి ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 21,000 స్థాయిని అధిగమించి 21,026 రికార్డుస్థాయికి చేరిన అనంతరం 20,997 పాయింట్ల వద్ద నిలిచింది. తాజా ర్యాలీకి బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లు ఊతమిచ్చాయి. అటు యూఎస్, ఇటు భారత్‌లోనూ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నందున, 70,000 పాయింట్లు దాటిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.అలాగే బుధవారం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని వెల్లడించనున్నందున ట్రేడర్లు జాగ్రత్త వహిస్తున్నారని వివరించారు.
సోమవారంనాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా ఆదిత్యా బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతంపైగా పెరిగి రూ.9,670 ఆల్‌టైమ్ రికార్డుస్థాయి వద్ద ముగిసింది. నెస్లే, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్‌లు లాభపడ్డాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హిందుస్థాన్ యూనీలీవర్, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్, భారతి ఎయిర్‌టెల్‌లు స్వల్పంగా తగ్గాయి. సెన్సెక్స్ జాబితాలో 17 షేర్లు లాభాలతో ముగిసాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.66 శాతం వరకూ పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో కమోడిటీ, మెటల్, సర్వీసెస్ ఇండెక్స్‌లు 1.16 శాతం, 1.1 శాతం, 0.95 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్, ఆటో సూచీలు 0.67 శాతం, 0.48 శాతం చొప్పున పెరిగాయి. హెల్త్‌కేర్ 0.38 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.15 శాతం మేర తగ్గాయి.