న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశంలో మున్ముందు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని మెర్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ‘ఉద్యోగాల వృద్ధి ఆగిపోయింది’ అంటూ ఇటీవలి ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిజానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ సంస్థలు వ్యాపార విస్తరణలో ఉన్నాయని, సహజంగా ఇలాంటప్పుడు ఉద్యోగావకాశాలు పెరగాలని, అయితే ఆటోమేషన్, వ్యయ నియంత్రణ కారణంగా పెద్దగా ఉద్యోగాలు వచ్చే వీల్లేదని అన్నారు.
ఏటా దేశంలో కొత్తగా 80 లక్షల గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం అన్వేషణ మొదలు పెడుతున్నారని, కానీ వారి కలలకు, ఉన్న అవకాశాలకూ పొంతనే లేకుండా పోతున్నదని సౌరభ్ తెలిపారు. దీంతో కొన్నేండ్లలో దేశ యువత, ముఖ్యంగా మధ్యతరగతివారు ఉద్యోగాల్లేని ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో యాంత్రిక సామర్థ్యాలు వచ్చాయని, మున్ముందు ఈ ధోరణి పెరిగి అంతటా మానవ వనరుల వినియోగం తగ్గిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో మనుషుల ద్వారా నడిచిన వ్యవస్థలన్నీ ఇప్పుడు సాంకేతికత ఆధారంగా నడుస్తున్నాయని గుర్తుచేశారు. మారుతున్న మార్కెట్ ముఖచిత్రం, అవసరాలు కూడా కంపెనీలను టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడేలా చేస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగులకు ముప్పేనని హెచ్చరించారు. ప్రస్తుతం చాలా రంగాల్లో గిగ్ వర్కర్లు వచ్చేశారని, ఇది కూడా జాబ్‌లెస్ ఫ్యూచర్‌కు నిదర్శనమేనన్నారు. మొత్తానికి భావితరాలను చిన్నప్పట్నుంచే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.