ముంబై, జూలై 7: అగ్రరాజ్యం అమెరికా డాలర్ దెబ్బకు రూపాయి మారకానికి భారీ చిల్లులుపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఒకేరోజు 54 పైసలు పడిపోయి 85.94కి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, డాలర్ బలోపేతం కావడంతో ఇతర కరెన్సీలు తీవ్రంగా నష్టపోయాయి.
ప్రతీకార సుంకాల విధింపుపై అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతో దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 85.53 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 85.51-86.03 స్థాయిలో కదలాడింది. చివరకు గత ముగింపుతో పోలిస్తే 54 పైసలు కోల్పోయి 85.94 వద్ద స్థిరపడింది. గతవారంలో రూపాయి విలువ 20 పైసలకు పైగా పెరిగిన విషయం తెలిసిందే. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర స్వల్పంగా పెరిగి 68.48 డాలర్లకు చేరుకున్నది.