ముంబై, సెప్టెంబర్ 23: ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ ముందు భారతీయ కరెన్సీ రూపాయి వెలవెలబోతున్నది. పడుతూలేస్తూ సాగుతున్న రూపీ విలువ.. మంగళవారం ట్రేడింగ్‌లో మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. ఈ ఒక్కరోజే 45 పైసలు నష్టపోయిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే మునుపెన్నడూ లేనివిధంగా 88.73 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 88.82 స్థాయికి క్షీణించింది. అయితే తిరిగి కోలుకోవడంతో నష్టాల తీవ్రత తగ్గినైట్టెంది.
ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయ ఐటీ సేవల ఎగుమతులకు గట్టి దెబ్బే తగిలింది. మరోవైపు నిరంతరాయంగా దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఫండ్స్ తరలిపోతుండగా.. ఇంకోవైపు స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి జీవనకాల కనిష్ఠ స్థాయిలకు బలహీనపడింది. ఈ పరిణామాలన్నింటిపై ఇప్పుడు మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెరిగిన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుముతో మునుపటిలాగా భారతీయులు అమెరికాకు వెళ్లే వీలుండదని, ఇదే జరిగితే దేశంలోకి రెమిటెన్సులు తగ్గి డాలర్ల రాక పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. డాలర్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఐటీ ఎగుమతుల పతనం, రెమిటెన్స్‌లకు బ్రేక్ వంటివి భారతీయ ఫారెక్స్ నిల్వలను ప్రభావితం చేస్తాయని, దీనికి రూపాయి నష్టాలు తోడైతే మరింత వేగంగా డాలర్లు కరిగిపోవచ్చని విశ్లేషిస్తున్నారు. సోమవారం కూడా డాలర్‌తో చూస్తే రూపాయి విలువ 12 పైసలు తగ్గిన సంగతి విదితమే.
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూపాయి విలువ రూ.3కుపైగా నష్టపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ 31న డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 85.64 వద్ద ముగిసింది. ఇప్పుడు 88.73 వద్ద ఉండగా.. గడిచిన దాదాపు ఈ 9 నెలల్లో 3.09 పైసలు పడిపోయినైట్టెంది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులు రాబోయే 3 నెలల్లో రూపాయి విలువను ఇంకా దిగజార్చగలవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే రూపాయి విలువ తగ్గినకొద్దీ దేశంలోకి జరిగే దిగుమతులు భారమైపోగలవు. ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తే.. ధరల అదపునకు ఆర్బీఐ వడ్డీరేట్లను మళ్లీ పెంచుతూపోవచ్చు. చివరకు దేశ ఆర్థిక వృద్ధే కుంటుపడే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
అమెరికా వీసా ఫీజు పెంపు.. భారతీయ మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలకూ దారితీసింది. దీంతో రూపాయి మున్ముందు సెషన్లలో ఇంకా బలహీనపడవచ్చని అనుకుంటున్నాం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలతో రూపాయికి కొంత బలం చేకూరే వీలుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం కూడా రూపాయి విలువను పెంచగలదు.
-అనుజ్ చౌధరి, రిసెర్చ్ అనలిస్ట్