రూపాయి పతనం భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కూ దడ పుట్టిస్తున్నది. చివరకు కరెన్సీ మార్కెట్లో బ్యాంకింగ్ ట్రేడింగ్‌కు కళ్లెం వేసేదాకా సెంట్రల్ బ్యాంక్ వెళ్లాల్సి వస్తున్నది. అవును.. రూపీని బలహీనపర్చకండంటూ బడా బ్యాంకులను ఆర్బీఐ వేడుకుందన్న వార్తలు ఇప్పుడు ఒకింత కలవరపాటుకే గురిచేస్తున్నాయి మరి. రూపాయి తలరాతను రాసే కేంద్ర బ్యాంకుకే ఎందుకింతటి ఖర్మ? అంటే అర్థం కాని అయోమయంలో యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ పడిందిప్పుడు. డాలర్ ముందు రూపాయి నష్టాలు జీవనకాల గరిష్ఠాలను తాకుతుంటే.. మోదీ సర్కారు హయాంలో మారకం విలువ ఏకంగా రూ.23.63 దిగజారడం ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నది.
Rupee | న్యూఢిల్లీ, ఆగస్టు 8: రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శతవిధాలా ప్రయత్నిస్తున్నది. తన వద్దనున్న అన్ని సాధనాలనూ వినియోగించుకుంటున్న సెంట్రల్ బ్యాంక్.. ఆఖరికి సామ, దాన, భేద, దండోపాయాలకూ దిగుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా కరెన్సీ మార్కెట్లో రూపీకి పోటీగా తమ ట్రేడింగ్ పొజిషన్లను పెంచుకోవద్దని పలు ప్రముఖ బ్యాంకులకు హుకుం జారీ చేసినట్టు రాయిటర్స్ కథనం చెప్తున్నది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్, మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ వంటి జాతీయ ప్రధాన వార్తా పత్రికల్లోనూ వచ్చింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజూ పడిపోతూనే ఉండటాన్ని చూస్తూనే ఉన్నాం.
సోమవారం స్పాట్ మార్కెట్లో మునుపెన్నడూ లేనివిధంగా 84.09 స్థాయికి దిగజారింది. ఆసియా దేశాల్లో గత నెల రోజుల్లో ఇంతలా మరే దేశపు కరెన్సీ విలువ దిగజారింది లేదు. దీంతో అప్రమత్తమైన ఆర్బీఐ.. మంగళవారం అత్యవసరంగా స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లతోపాటు, నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్డీఎఫ్) సెగ్మెంట్ లావాదేవీల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే పెద్ద బ్యాంకులను ట్రేడింగ్ పొజిషన్లు తగ్గించుకోవాలని సూచించినట్టు ఇప్పుడు తెలియవస్తున్నది. అయితే ఈ పరిణామం అటు కరెన్సీ మార్కెట్లో.. ఇటు దేశ ఆర్థిక వ్యవస్థలో గుబులు పుట్టిస్తున్నది. రూపీని నడిపించే ఆర్బీఐనే ఇంతలా గాబరా పడిపోతున్నదేమిటా? అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 84 మార్కును దాటకూడదని ఆర్బీఐ గట్టిగానే ప్రయత్నించింది. ఇందుకోసం స్పాట్ మార్కెట్ తెరుచుకోవడానికి ముందే రూ.12,500 కోట్ల విలువైన డాలర్లను ఎన్డీఎఫ్ మార్కెట్లో అమ్మేసింది. తద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గేలా చేసింది. నిజానికి ఈ తరహా చర్యలను ఆర్బీఐ ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అయితే ఓవైపు ఇలా చేస్తూనే.. మరోవైపు బ్యాంకింగ్ కార్యకలాపాలనూ నియంత్రించేందుకు ప్రయత్నించడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. స్పాట్ మార్కెట్లో రూపాయి నష్టాలు..
వర్తకుల ట్రేడింగ్‌కు ఆటంకంగా మారుతున్నది. దీంతో రూపీపై తమ లాంగ్ పొజిషన్లను బలపర్చుకునేందుకు అప్పటికప్పుడు చైనా కరెన్సీ యువాన్ కోసం అంత ఎగబడ్డారు. ఇది ఒక్కసారిగా రూపాయిని బలహీనపర్చింది. అలాగే ఎన్డీఎఫ్ మార్కెట్లో స్థానిక బ్యాంకులు అదనపు పొజిషన్లు తీసుకున్నకొద్దీ రూపాయిని బలపర్చేందుకు ఆర్బీఐ మరింత శ్రమించాల్సి వస్తుంది. డాలర్లను పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దేశంలో ఫారెక్స్ నిల్వల్ని దిగజార్చగలదు. అందుకే ఒక స్థాయి వరకే డాలర్లను విడుదల చేసేందుకు ఆర్బీఐ సుముఖత చూపిస్తుంది. ఆ తర్వాతే ఇతర సాధనాలను ఉపయోగిస్తుంది.
పడిపోతున్న రూపాయి మారకం విలువ.. ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతుంది. తినే తిండి నుంచి.. వాడే వస్తూత్పత్తి వరకు, తీసుకునే రుణం దగ్గర్నుంచి.. చేసే పొదుపుదాకా అన్నీ ప్రభావితమవుతాయి. ముఖ్యంగా దిగుమతులు భారమైపోతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగితే.. దాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ కఠిన ద్రవ్యవిధానాన్ని అనుసరించాల్సి వస్తుంది. ఫలితంగా బ్యాంకులిచ్చే అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజానీకమే ఎక్కువగా ఉన్న మన దేశంలో వినిమయ శక్తి దెబ్బతింటుంది.
కొనుగోళ్లు లేక మార్కెట్లో వ్యాపారాలు కుంటుబడుతాయి. తద్వారా ఉత్పత్తి మందగిస్తుంది. పెట్టుబడులు రాక కీలక రంగాల్లో నిస్తేజం ఆవరిస్తుంది. ఉద్యోగ-ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. చివరకు దేశ ఆర్థిక వృద్ధిరేటు ఆగిపోతుంది. అందుకే ఏ దేశానికైనా దాని కరెన్సీనే ఆయువుపట్టు కానీ ఇప్పుడు రూపాయి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు తయారైంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి రూపాయి పతనం కొనసాగుతూనే ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు కొలమానంగా భావించే రూపీ ఎంతకీ లేవలేని దుస్థితికి దిగజారిందన్నా అతిశయోక్తి కాదు. 2014లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 60.34గా ఉన్నది. ఇప్పుడిది 83.97గా నమోదైంది. అంటే గడిచిన పదేండ్లకుపైగా కాలంలో రూపాయి విలువ ఏకంగా 23.63 మేర క్షీణించింది.
అంతకుముందు మన్మోహన్ సింగ్ పాలనలోనూ రూపాయి పడిపోయినప్పటికీ.. ఇంతకన్నా తక్కువే. ఆ పదేండ్లలో 15.97 మేర దిగజారింది. అయితే అప్పటితో చూస్తే ఇప్పుడే కరెన్సీ మార్కెట్లో ఒడిదొడుకులు ఎక్కువయ్యాయి. ఇందుకు అంతర్జాతీయ పరిణామాలు కారణమైనా.. దేశీయ పరిస్థితులూ హేతువేనన్నది కాదనలేని సత్యం.