ముంబై, ఏప్రిల్ 30: రూపాయి కకావికలమైంది. అంతర్జాతీయ కరెన్సీ డాలర్ దెబ్బకు దేశీయ కరెన్సీ విలవిలలాడింది. కొన్ని రోజులుగా నష్టాలే పరమావధిగా పయనిస్తున్న మారకం విలువ పాతాళంలోకి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ఇంట్రాడేలో 95కి పైగా పతనం చెందింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ భగ్గుమనడం, గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం దేశీయ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపింది.
గురువారం ఉదయం 95.01 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో చారిత్రక కనిష్ఠ స్థాయి 95.34కి పడిపోయింది. దేశీయ మారకం చరిత్రలో ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగడంతో చివరకు కోలుకున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 4 పైసలు పెరిగి 94.84 వద్ద స్థిరపడింది. బుధవారం కరెన్సీ విలువ 20 పైసలు కోల్పోయి 94.88 వద్ద ముగిసింది. మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, బుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి.