Interest Rates | రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలగడం కలగానే మారిపోతున్నది. ముఖ్యంగా గృహ రుణగ్రహీతలపై భారం తడిసి మోపెడవుతున్నదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే బ్యాంకింగ్ రంగ నిపుణులు ఈ రుణ భారం తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలను సూచిస్తున్నారు.
గృహ రుణం వంటి దీర్ఘకాల లోన్లను తీసుకున్నవారికి అధిక వడ్డీరేట్లు శరాఘాతమే అవుతాయి. అయితే రుణ కాలపరిమితిని వీలైనంత తగ్గించుకుంటే వడ్డీ భారం కూడా తక్కువగా పడుతుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. చక్రవడ్డీ నుంచి ఉపశమనం లభిస్తుండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు పదేండ్ల కాలవ్యవధితో రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం వార్షిక వడ్డీరేటుకు తీసుకున్నైట్టెతే రూ.26 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. కానీ ఇదే రుణాన్ని 15 ఏండ్ల కాలవ్యవధితో తీసుకుంటే వడ్డీ భారం రూ.41 లక్షలకు, 20 ఏండ్లకైతే రూ.58 లక్షలకు పెరుగుతున్నది. కాబట్టి వీలున్నప్పుడల్లా కొద్దికొద్దిగా అసలు రుణాన్ని తీర్చుతూపోతే టెన్యూర్‌ను తగ్గించుకోవచ్చు.
ఈఎంఐలను మాత్రం తగ్గించుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈఎంఐ తగ్గితే భారం అంతే ఉంటుంది. అలాగే పెరిగే మీ ఆదాయాన్నిబట్టి ఏటా మీ ఈఎంఐలను పెంచుకుంటూపోయినా రుణ భారం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఈఎంఐని ఏటా 5 శాతం పెంచుకుంటూపోయినా 20 ఏండ్ల కాలవ్యవధితో ఉన్న గృహ రుణం 18 ఏండ్లకు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. ఈఎంఐ 10 శాతం పెంచుకుంటే 9 శాతం వార్షిక వడ్డీరేటుతో ఉన్న రూ.50 లక్షల రుణం కాలవ్యవధి 10 ఏండ్లకు తగ్గుతుంది.