న్యూఢిల్లీ, జూన్ 25: రిలయన్స్ జియో.. భారతీయ టెలికం రంగంలో గేమ్ ఛేంజర్. జియో రాకతో దేశీయ టెలికం పరిశ్రమ ముఖచిత్రమే మారిపోయింది మరి. అయితే జియో ఆలోచన తెరపైకి వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న చాలామంది విశ్లేషకులు.. అది సఫలం కాదని, ఆర్థికంగా నష్టపోతావని హెచ్చరించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నాటి పరిస్థితులను ఇప్పుడు గుర్తుచేసుకున్నారు. ‘మెకిన్సే అండ్ కో’కు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అంబానీ మాట్లాడుతూ.. ‘2016లో రిలయన్స్ జియోతో దేశీయ టెలికం ఇండస్ట్రీలోకి మళ్లీ రావడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద రిస్క్’ అని విశదీకరించారు. ఆ సమయంలో చాలామంది విశ్లేషకులు జియో ను ఓ విఫల ప్రయత్నంగా అభివర్ణించారని, దానివల్ల నష్టపోతావంటూ హెచ్చరించారని చెప్పుకొచ్చారీ ఆసియాలోనే అత్యంత శ్రీమంతుడు. అయితే ఒకవేళ ఆ అంచనాలే నిజమై, నష్టాలే ఎదురైనా భారతీయ డిజిటలైజేషన్లో జియో కీలకపాత్రనే పోషించగలదన్న నమ్మకంతో ముందుకు నడిచినట్టు వివరించారు.
లక్షల కోట్లతో..
భారత్ ఇంకా 4జీ వంటి అత్యంత అడ్వాన్స్ డిజిటల్ టెక్నాలజీకి సిద్ధంగా లేదని, జియో ఆర్థికంగా నిలదొక్కుకోదని పలువురు అనలిస్టులు చెప్తున్నా.. దేశవ్యాప్తంగా 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పెట్టామని ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ బోర్డు సభ్యులతో.. ‘నష్టాలు వాటిల్లినా పర్వాలేదు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన సొమ్ము ఎక్కడినుంచో తేలేదు. అదంతా మనదే. డిజిటల్ భారత నిర్మాణానికి కృషి చేద్దాం’ అన్నట్టు అంబానీ చెప్పారు. 2016 సెప్టెంబర్‌లో మొదలైన జియో మొబైల్ సేవలు.. దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ఖరీదుకే నాణ్యమైన ఎక్కువ ఇంటర్నెట్ డాటా జియో వినియోగదారులకు లభించాయి. ఫలితంగా మార్కెట్లోని పోటీ సంస్థలు కూడా జియోనే అనుసరించాల్సి వచ్చింది. ప్రస్తుతం జియోకు 47 కోట్లమంది కస్టమర్లున్నారు.
పెట్రో వ్యాపారంలో అంబానీ-అదానీ జట్టు
దేశీయ పెట్రో వ్యాపారంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ భాగస్వాములవబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన బీపీతో కలిసి జియో-బీపీ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను అంబానీ అమ్ముతున్న విషయం తెలిసిందే. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్) పేరిట సీఎన్జీ స్టేషన్లను అదానీ నిర్వహిస్తున్న సంగతీ విదితమే. కాగా, తాజా వ్యాపార ఒప్పందం ప్రకారం దేశంలోని ఆయా జియో-బీపీ బంకుల్లో ఏటీజీఎల్ సీఎన్జీ విక్రయాలూ జరుగబోతున్నాయి. అలాగే కొన్ని ఏటీజీఎల్ సీఎన్జీ స్టేషన్లలో జియో-బీపీ పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఉండనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,972 జియో-బీపీ పెట్రోల్ బంకులున్నాయి. అలాగే 650 ఏటీజీఎల్ సీఎన్జీ స్టేషన్లున్నాయి. ఇప్పటికే గత ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని ఓ పవర్ ప్రాజెక్టు కోసం అంబానీ, అదానీ చేతులు కలిపారు. ఈ ప్రాజెక్టులో అంబానీకి 26 శాతం వాటా ఉండనున్నది.