న్యూఢిల్లీ, జూన్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. గత వారం జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోను ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్లు రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఆర్ఎల్ఆర్) ఆధారిత రుణాలపై, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారిత లోన్లపై వసూలు చేస్తున్న వడ్డీరేట్లకు 10 నుంచి 50 బేసిస్ పాయింట్లదాకా కత్తెర వేశాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ బెంచ్మార్క్ లెండింగ్ రేటు ఆర్ఆర్ఎల్ఆర్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గిన వడ్డీరేట్లు ఈ నెల 7 నుంచే వర్తిస్తాయని ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ తెలిపింది. ఆర్ఆర్ఎల్ఆర్ అనుసంధానంగా ఈ బ్యాంక్లో లోన్లు తీసుకున్న రుణగ్రహీతలందరికీ ప్రయోజనం చేకూరుతుంది. కాగా, ప్రస్తుతం బీవోబీ ఆర్ఆర్ఎల్ఆర్ 8.15 శాతంతో మొదలవుతున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఈ నెల 7 నుంచే తగ్గిన వడ్డీరేటు అమల్లోకి వచ్చింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారంగా రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ఈ నిర్ణయం లాభిస్తుంది. కాగా, ప్రస్తుతం ఓవర్నైట్, నెల ఎంసీఎల్ఆర్ 8.90 శాతంగా ఉన్నాయి. 3 నెలలది 8.95 శాతానికి, 6 నెలలు, ఏడాది టెన్యూర్ 9.05 శాతంగా ఉన్నాయి. రెండేండ్లు, మూడేండ్లు టెన్యూర్స్పై వడ్డీరేటు 9.10 శాతంగా ఉన్నది. ఇదిలావుంటే ఆర్ఆర్ఎల్ఆర్నూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలున్నాయి. దీని ఆధారంగా రుణాలు తీసుకున్నవారికి వచ్చే నెల నుంచి ఈ లాభం అందనున్నట్టు తెలుస్తున్నది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఆర్ఆర్ఎల్ఆర్ 50 బేసిస్ పాయింట్లదాకా తగ్గింది. సోమవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 7.45 శాతం నుంచి మొదలవుతుండగా, వాహన రుణాలపై 7.80 శాతం నుంచి ప్రారంభమవుతున్నది.
యూకో బ్యాంక్
అన్ని రకాల టెన్యూర్స్పై యూకో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింది. తగ్గిన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నెల ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి, ఓవర్నైట్ 8.15 శాతానికి, 3 నెలలు 8.50 శాతానికి, 6 నెలలు 8.8 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతానికి దిగొస్తున్నాయి. అయితే సోమవారం నుంచే ఆర్ఆర్ఎల్ఆర్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం ఇది 8.30 శాతంగా ఉన్నది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఆర్ఆర్ఎల్ఆర్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఈ వడ్డీరేటు 8.35 శాతంతో మొదలవుతున్నది. తగ్గించిన వడ్డీరేటు ఈ నెల 6 నుంచే అమల్లోకి వచ్చిందని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ తెలిపింది.
కరూర్ వైశ్యా బ్యాంక్
6 నెలల ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు, ఏడాది ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్లు కోతపెట్టి 9.80 శాతానికి తీసుకొచ్చింది ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చాయి.
ఆర్ఆర్ఎల్ఆర్ అంటే?
రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఆర్ఎల్ఆర్) ఆర్బీఐ రెపోరేటు ఆధారంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును తగ్గిస్తే ఇది తగ్గుతుంది. పెంచితే పెరుగుతుంది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ల (ఈబీఎల్ఆర్)లో ఆర్ఆర్ఎల్ఆర్ కూడా ఒకటి.
ఎంసీఎల్ఆర్ అంటే?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి బ్యాంకులే నిర్ణయిస్తాయి. దీన్ని ఇంటర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఐబీఎల్ఆర్)గా కూడా పరిగణిస్తారు. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి, అందుబాటులో ఉన్న నిధులు, వాటికయ్యే ఖర్చులపై ఈ వడ్డీరేటు ఆధారపడి ఉంటుంది.