హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోతున్నది. ఒకప్పుడు వందలాది ప్రాజెక్టులతో కళకళలాడిన హైదరాబాద్ మార్కెట్లో ఏడాదిన్నరగా కొత్త ప్రాజెక్టుల రాక క్రమేణా తగ్గిపోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన హైడ్రా, తదనంతర కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ పేరిట బఫర్ జోన్ మార్కింగ్ వంటివి రాష్ట్ర నిర్మాణ రంగం విధ్వంసమే లక్ష్యంగా సాగాయిమరి. ఈ క్రమంలోనే చాలామంది బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను ప్రకటించడం కంటే.. తమ దగ్గరున్న స్థలాలు, ప్లాట్లతోపాటు నిర్మాణం పూర్తయినా ఇంకా అమ్ముడుపోని ఇండ్లు, ఫ్లాట్లను సైలెంట్‌గా సేల్ చేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్-జూన్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు 19 శాతం తగ్గినట్టు తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ విడుదల చేసిన నివేదిక చెప్తుండటం గమనార్హం.
గతంతో పోల్చితే ఈ ఏప్రిల్-జూన్‌లో ఇప్పటిదాకా నమోదైన అమ్మకాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. తాజా రిపోర్టులో 27 శాతం క్షీణించి హైదరాబాద్‌లో హౌజింగ్ సేల్స్ 11,040గానే ఉన్నాయని అనరాక్ తెలియజేసింది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 15,085 యూనిట్ల విక్రయాలు జరిగాయన్నది. ఇటీవల వచ్చిన ప్రాప్‌ఈక్విటీ నివేదికలోనూ ఈసారి హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ 20 శాతం పడిపోవచ్చని అంచనా వేసిన విషయం తెలిసిందే. నిజానికి గృహ రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ ఇండ్ల కొనుగోలుకు అంతమాత్రంగానే కస్టమర్లు ముందుకొస్తుండటంతో రాష్ట్ర మార్కెట్.. ప్రధానంగా హైదరాబాద్‌పై ప్రజల్లో ఒకింత నమ్మకం సడలిందా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
రెసిడెన్షియల్ సెగ్మెంట్ తర్వాత నగరంలో అత్యంత డిమాండ్ ఉన్నది కమర్షియల్ స్పేస్‌కు మాత్రమే. గత బీఆర్ఎస్ హయాంలో అందిన ప్రోత్సాహంతో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన ఐటీ కంపెనీలతో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కళకళలాడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది. ఓవైపు కొరవడిన రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మరోవైపు ఆర్థిక మాంద్యం ఛాయలు.. మార్కెట్లో స్తబ్ధతను తీసుకొచ్చాయి. వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీలు కొత్త నియామకాలకు దూరంగా ఉంటుండటమేగాక, ఉన్న ఉద్యోగుల్నీ తీసేస్తున్నాయి. ఫలితంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండే లేకుండా పోయింది. నిజానికి గత ప్రభుత్వం దూరదృష్టితో అన్ని రంగాలకు పెద్దపీట వేయడంతో ఫార్మా, ఏరోస్పేస్, ఐటీ, డాటా సెంటర్స్, ఈ-కామర్స్ ఇలా ఎన్నో రంగాల కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. దీంతో ఇక్కడి ఆఫీస్ స్పేస్ దేశంలోనే అత్యంత ఆదరణను చూరగొన్నది. కాగా, డిమాండ్ లేమితో వచ్చే మూడేండ్లకు సరిపడా ఇన్వెంటరీలు మార్కెట్లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 40 శాతం కమర్షియల్ టవర్లు ఖాళీగానే ఉన్నట్టు వెల్లడైంది. గతంతో పోల్చితే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల నుంచీ గిరాకీ తగ్గడంతో ఆఫీస్ స్పేస్ నిర్వాహకుల పరిస్థితి అయోమయంగా తయారైంది.
రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్గధామంలా ఉన్న హైదరాబాద్ నగరంలో అమ్మకాల్లేక బిల్డర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మార్కెట్ స్వరూపమే మారిపోవడంతో ఉన్న ప్రాజెక్టులలో మిగిలిపోయిన వాటిని అమ్ముకుంటే సరిపోతుందనే భావనకు వచ్చారు. ప్రభుత్వ విధానాలు బిల్డర్లతోపాటు, భవిష్యత్తుకు భరోసా ఉంటుందని గతంలో స్థిరాస్తుల్ని కొన్న యజమానుల్నీ భయపెడుతున్నాయి. ఈ పరిస్థితి మార్కెట్లో ధరల పతనానికీ దారితీస్తుండటం ఇప్పుడు నిర్మాణ రంగానికి శాపంలా పరిణమించింది. నగర రియల్ ఎస్టేట్ రంగానికి దన్నుగా నిలిచే రెసిడెన్షియల్ సెగ్మెంట్ కళావిహీనంగా తయారైందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ప్రభుత్వ విధానాలు మార్కెట్‌ను తీవ్ర స్థాయిలో దెబ్బతీశాయని, ముఖ్యంగా హైడ్రా భయంతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టులకు దూరమయ్యారని అనరాక్ నివేదికను చూస్తే అర్థమవుతున్నది. నిరుడు ఏప్రిల్-జూన్‌లో 13,750 యూనిట్లను కొత్తగా మార్కెట్లోకి రియల్టర్లు తెచ్చారు. అయితే ఈ ఏడాది ఇదే వ్యవధిలో అవి 11,105కు పరిమితమయ్యాయి. దీంతో 19 శాతం క్షీణించాయి.