దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ఈ క్రమంలోనే సూచీలు మిశ్రమంగా ముగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 5.70 పాయింట్లు పెరిగి 85,712.37 దగ్గర ఆగింది. అయితే నిఫ్టీ 16.50 పాయింట్లు కోల్పోయి 26,186.45 వద్ద నిలిచింది. నిజానికి వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లకు ఆర్బీఐ రెపోరేటు తగ్గింపు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చివరిరోజు భారీ లాభాలే నిదర్శనం. ఈ నేపథ్యంలో ఈ వారంలోనూ ఆర్బీఐ జోష్ ట్రేడింగ్‌లో కనిపించవచ్చని మెజారిటీ ఎక్స్పర్ట్స్ మాట. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ తదితర ఆర్బీఐ రెపోరేటు ఆధారిత షేర్లు మదుపరులను ఆకట్టుకోవచ్చు.
ఇదే జరిగితే సూచీలు ఆల్‌టైమ్ హై రికార్డుల్లోకి వెళ్లడం ఖాయమనే చెప్పాలి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పెద్దపీట వేసే వీలుకూడా లేకపోలేదు. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ఇతర అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. కాగా, రూపాయి పతనం కొనసాగుతుండటంతో సెల్లింగ్ ప్రెషర్ సహజంగానే ఉంటుంది. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో అంతర్జాతీయంగా అమెరికా వేసే ఎత్తులు కూడా సూచీలను ప్రభావితం చేయవచ్చు. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,900 పాయింట్ల స్థాయి కీలకం. దీనికి దిగువన ముగిస్తే 25,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల అభిప్రాయం. సూచీలు పరుగందుకుంటే నిఫ్టీ 26,400-26,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఒడిదుడుకు లు సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆ యా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్ర మే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.