దేశీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభానికితోడు వర్షాభావ పరిస్థితుల భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినా.. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే వీలుందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి మరి. ఈ కారణంగానే గత వారం చివరి రోజు ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలకు లోనయ్యాయి. దీంతో అంతకుముందు వారంతో పోల్చితే గత వారం సెన్సెక్స్ 639.61 పాయింట్లు లేదా 0.84 శాతం పడిపోయి 74,775.74 దగ్గర నిలిచింది. నిఫ్టీ 171. 55 పాయింట్లు లేదా 0.72 శాతం కోల్పోయి 23,547.75 వద్ద స్థిరపడింది. ఇక ఈ వారం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఉన్నది. ఇందులో నిర్ణయాలు బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లను ఎక్కువగా ప్రభావితం చేయనున్నాయి. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కీలక వడ్డీరేట్లను పెంచితే సెల్లింగ్ ప్రెషర్ ఖాయమని చెప్పవచ్చు. తగ్గిస్తే పెట్టుబడులకు మద్దతు లభించినట్టే అనుకోవచ్చు.
అలాగే మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగితే క్రూడాయిల్ రేట్లు పరుగులు పెట్టే అవకాశాలున్నాయి. దీంతో చమురు, సహజ వాయువు ఆధారిత రంగాల్లో అమ్మకాల ఒత్తిడి తప్పదు. అయితే శాంతి స్థాపనకు అడుగులు పడితే మార్కెట్లు పుంజుకోవచ్చు. తగ్గే ముడి చమురు ధరలు ఇందుకు దోహదం చేయగలవు. కానీ దేశీయ మార్కెట్లో పెరుగుతున్న పెట్రో ధరలు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటు పెరుగుతుందన్న అంచనాలే గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా, జనవరి-మార్చికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ప్రభావం కూడా మార్కెట్ ట్రేడింగ్‌పై ఒకింత ఉండనున్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఇటీవలికాలంలో రూపీ వాల్యూ పెరుగుతుండటం ఒకింత సానుకూల అంశంగానే చెప్పుకోవచ్చు. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,000 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,800-24,000 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.