దేశ ఆర్థిక వ్యవస్థపై మందగమనం మబ్బులు కమ్ముకుంటున్నాయా?
ఓవైపు ట్రంప్ టారిఫ్‌లు.. మరోవైపు విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. ఇంకోవైపు మార్కెట్లో పడిపోతున్న డిమాండ్.. వడ్డీరేట్ల కోతలకు చెక్ పెట్టాయా?
సాదాసీదాగా ముగిసిన రిజర్వ్ బ్యాంక్ తాజా ద్రవ్య సమీక్షతో ఇప్పుడివే సంకేతాలు వస్తున్నాయి మరి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఇక వడ్డీరేట్లు తగ్గడం కష్టమేనన్న అభిప్రాయాలూ వస్తుండటం గమనార్హం.
ముంబై, ఆగస్టు 6 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఈసారి మాత్రం ఈ పరుగుకు బ్రేక్ వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నడుమ వేచిచూసే ధోరణిని అవలంభించింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ).. తటస్థ వైఖరితోనే ముందుకెళ్లాలని, రెపోరేటును 5.5 శాతం వద్దే ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతకుముందు ఫిబ్రవరి (25 బేసిస్ పాయింట్లు), ఏప్రిల్ (25 బేసిస్ పాయింట్లు), జూన్ (50 బేసిస్ పాయింట్లు)లలో జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారీ ఈ కోతలు కొనసాగవచ్చన్న అంచనాలైతే ఏర్పడ్డాయి. కానీ అందుకు విరుద్ధంగా వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే పాలసీ మీటింగ్‌ను సాదాసీదాగా ఆర్బీఐ కానిచ్చేసింది.
తగ్గినట్టే తగ్గి ద్రవ్యోల్బణం గణాంకాలు మళ్లీ పెరుగుతుండటంతో ఆర్బీఐ అప్రమత్తమవుతున్నది. అందుకే ఈసారి వడ్డీరేట్ల కోతల్ని ఆపేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. మున్ముందు ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీరేట్లను తిరిగి పెంచవచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది చివరికల్లా ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగే వీలుందని గవర్నర్ మల్హోత్రా చెప్పడం గమనార్హం. అలాగే బ్యాంక్ రుణాలకు లేని డిమాండ్.. మార్కెట్లో స్తబ్ధతను సూచిస్తున్నది. ఆహారేతర రంగంలో ఈ ఆర్థిక సంవత్సరం రుణాల వృద్ధి 11 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 20.2 శాతంగా ఉన్నది. ఇక అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై గురువారం నుంచి ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయి. అలాగే రష్యాతో ముడి చమురు, రక్షణ సంబంధిత వాణిజ్య లావాదేవీలను కొనసాగిస్తున్నందుకుగాను మరో 25 శాతం అదనపు సుంకాలను ట్రంప్ బుధవారం విధించారు. గతంలో వేసిన టారిఫ్‌లతోనే భారత జీడీపీ అంచనాలు పడిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుంకాలు.. దేశ వృద్ధిరేటు ప్రగతికి ఇంకెన్ని కత్తెర్లు వేస్తాయో అన్న అనుమానాలు కలుగుతున్నాయిప్పుడు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్.. భారత మార్కెట్లో మందగమనం ఛాయలు అలుముకుంటున్నట్టు చెప్పడం అన్ని వర్గాల్లో ఒకింత ఆందోళననే కలిగిస్తున్నది.
భారతీయ ఆర్థిక వ్యవస్థనుద్దేశించి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి అమెరికా కంటే భారత్ ద్వారా జరుగుతున్న మేలే ఎక్కువన్నారు. వరల్డ్ ఎకానమీ వృద్ధిరేటులో భారత్ వాటా దాదాపు 18 శాతంగా ఉంటే, అమెరికా సుమారు 11 శాతం వద్దే ఉందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ‘మేము బాగానే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగుపడ్తాం’ అని ట్రంప్‌కు చురకలంటించారు. కాగా, దేశ జీడీపీ బలోపేతానికి అవసరమైన చర్యల కోసం ఆర్బీఐ నుంచి కావాల్సినంత మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మల్హోత్రా స్పష్టం చేశారు. కేవలం ద్రవ్య విధానంతోనేగాక, పలు రెగ్యులేటరీ విధానాల ద్వారా కూడా భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఆర్బీఐ నిలుస్తున్నదని చెప్పారు. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠాలకు పతనమవుతున్న నేపథ్యంలో దేశంలో విదేశీ మారకపు నిల్వలు సరిపడా ఉన్నాయని, వాటితో 11 నెలలు అన్ని దిగుమతుల్ని సజావుగా చేసుకోవచ్చని తెలిపారు.
ద్రవ్య సమీక్ష నిర్ణయం ఊహించినట్టుగానే ఉన్నది. రిజర్వ్ బ్యాంక్ పాలసీని ప్రస్తుతం వివిధ అంశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.
వడ్డీరేట్లు తగ్గితే మార్కెట్‌కు మరింత ఉత్సాహం వచ్చేది. రాబోయే ద్రవ్య సమీక్షలోనైనా రెపోరేటును దించితే పండుగ సీజన్లో ఇండ్ల అమ్మకాలకు కలిసొస్తుంది.
ఆర్బీఐ ద్రవ్య సమీక్ష అంచనాలకు దూరంగా సాగింది. ప్రధానంగా పాలసీ నిర్ణయాలు వాణిజ్యంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిని ప్రతిబింబించాయి.
దేశంలో స్థిరాస్తి విక్రయాలు పెరగాలంటే వడ్డీరేట్లు ఇంకా తగ్గాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తదుపరి ద్రవ్య సమీక్షలో ఈ మేరకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం.