Shaktikanta Das | భువనేశ్వర్, ఆగస్టు 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 15 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చుల్లో ప్రతిష్ఠంభన నెలకొనడం వల్లనే వృద్ధిరేటు మందగించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంక్ అంచనావేయగా, కానీ 6.7 శాతానికి పరిమితమైంది. వినిమయం, పెట్టుబడులు, తయారీ, సేవలు, నిర్మాణ రంగాలు ఏడు శాతానికి పైగా వృద్ధిని కనబరిచినప్పటికీ మిగతా రంగాల్లో మందకొడి నెలకొన్నదని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోవడం, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న మందకొడి పరిస్థితుల కారణంగా దేశ వృద్ధిరేటు తగ్గిందని దాస్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల నేపథ్యంలో తొలి త్రైమాసికంలో ప్రభుత్వ ఖర్చులు తగ్గినప్పటికీ..వచ్చే త్రైమాసికాల్లో మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని, తద్వారా వృద్ధిరేటు పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో 2 శాతం మాత్రమే వృద్ధిని సాధించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అంచనావేసినదానికంటే వర్షాలు అధికంగా కురియనుండటంతో వ్యవసాయం మెరుగైన వృద్ధి సాధించే అవకాశాలున్నాయని చెప్పారు.