చెన్నై, ఏప్రిల్ 12:ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా వడ్డీరేట్లను తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రెపోతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు 9.10 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంక్ అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది.
ఎన్ఎస్ఈలో 22 కోట్లు దాటిన ఇన్వెస్టర్లు
ముంబై, ఏప్రిల్ 12: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్ సూచీ ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా) మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఎన్ఎస్ఈ పెట్టుబడిదారులు 22 కోట్లు అధిగమించారు. అక్టోబర్ 2024లో 20 కోట్ల మంది పెట్టుబడిదారులను అధిగమించిన సంస్థ..ప్రస్తుతం మరో 2 కోట్ల మంది పెట్టుబడిదారులను ఆకట్టుకోగలిగింది. వీరిలో యునిక్యూ రిజిస్టర్ ఇన్వెస్టర్లు 11.3 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఈక్విటీలో అత్యధిక మంది పెట్టుబడిదారులు కలిగిన రాష్ర్టాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 3.8 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో 2.4 కోట్లు, గుజరాత్లో 1.9 కోట్లు, రాజస్థాన్, బెంగాల్లో 1.3 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ఇన్వెస్టర్లలో వీరి వాటా 49 శాతంగా ఉన్నది. గడిచిన ఐదేండ్లుగా నిఫ్టీ 50 ఇండెక్స్ సూచీ వార్షిక ప్రతిపాదికన 22 శాతం రిటర్నులు పంచిందని, నిఫ్టీ 500 ఇండెక్స్ 25 శాతం రిటర్నులు పంచినట్టు ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు.