PSU Stocks | న్యూఢిల్లీ, జూన్ 22: ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్‌కు ఆయా సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో మింగుడుపడటం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంస్థను వదలడం లేదు. ఏకంగా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించిన సంస్థలను సైతం అమ్మకానికి పెట్టారు.
ఎల్ఐసీతోపాటు ఏ సంస్థలో వాటాను బహిరంగ మార్కెట్లో అమ్మేశారు. మరోవైపు, ఈ సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. నరేంద్ర మోదీ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిననాటి నుంచి ఆయా సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా గత 10 రోజుల్లో పీఎస్‌యూల షేర్లు రూ.7 లక్షల కోట్ల మేర పెరగడం విశేషం. పీఎస్‌యూలను తెగనమ్మేస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేసినప్పటికీ ఆయా షేర్లు మాత్రం మదుపరులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాతో దేశీయ, విదేశీ మదుపరులు అధికంగా కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీటికితోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఎస్‌యూలు అంచనాలకుమించి రాణించడం కూడా మదుపరుల్లో ఉత్సాహన్ని నింపింది.
ముఖ్యంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడంతోపాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, కోల్ ఇండియాలు కూడా లాభాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఆయా సంస్థల షేర్లు రాణించడంతో సంస్థల మార్కెట్ విలువ రెట్టింపుస్థాయిలో పెరిగింది. సంస్కరణలు కొనసాగుతుండటం, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ సూచీలు రాణిస్తున్నాయి.
అలాగే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా ఆశావాదంగా కదులుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అధికంగా నిధులు కుమ్మరించడం కూడా కలిసొస్తున్నది. కానీ, పలువురు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దూసుకుపోతున్న పీఎస్‌యూల స్టాక్‌లు ఎప్పుడైనా పేలే అవకాశాలున్నాయని అంటున్నారు. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావచ్చని, అప్పుడూ ఆయా సూచీలు కుప్పకూలే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
పదేండ్లలో 4 లక్షల కోట్లు
గడిచిన పదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థ ల్లో వాటాల విక్రయం ద్వారా మోదీ సర్కార్ సేకరించింది అక్షరాల రూ.4.20 లక్షల కోట్లు. వీటిలో రూ.3.15 లక్షల కోట్లు మైనార్టీ వాటాను విక్రయించడంతో సమకూరగా, మరో రూ.69,412 కోట్లు మాత్రం పది ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాను విక్రయించడంతో లభించాయి. వీటిలో హెచ్‌పీసీఎల్, ఆర్ఈసీ, డీసీఐఎల్, హెచ్ఎస్సీసీ, ఎన్‌పీసీసీ, నెప్‌కో, టీహెచ్‌డీసీ, కామరాజర్ పోర్ట్, ఎయిర్ ఇండియా, ఎన్ఐఎన్ఎల్లు ఉన్నాయి.
పది రోజుల్లో 24 వేల కోట్లు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించుకుపోయిన ఎఫ్‌పీఐ.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకావడంతో మళ్లీ పెట్టుబడుల వైపు మళ్లారు. ఈ నెల 10 నుంచి ఇప్పటి వరకు జరిగిన పది ఈక్విటీ ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.23,786 కోట్ల నిధులు కుమ్మరించారు. ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెట్టడానికి ప్రధానంగా మూడు కారణాలని, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకావడంతో సంస్కరణలు కొనసాగే అవకాశం ఉండటం, చైనా ఆర్థిక వ్యవస్థ పరుగు నెమ్మదించడం, ముఖ్యంగా గడిచిన నెలరోజుల్లోనే రాగి ధరలు 12 శాతం తగ్గడం కూడా ఇందుకు కారణమని మోజోపీఎంఎస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అధికారి సునీల్ దమానియా తెలిపారు. అలాగే ఈక్విటీ మార్కెట్లో బ్లాక్ ఒప్పందాలు అధికంగా ఉండటం కూడా ఎఫ్‌పీఐల్లో జోష్ పెంచింది. జూన్ నెల వరకు ఎఫ్‌పీఐలు రూ.11,193 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.