హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పామాయిల్ ధర 37%, ఆవనూనె 29%, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు 23% చొప్పున, పల్లి నూనె ధర 2% మేర పెరిగాయి. గత నెలలో రూ.100 పలికిన లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు రూ.137కి చేరగా.. సోయాబీన్ నూనె ధర రూ.120 నుంచి రూ.148కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.120 నుంచి రూ.149కి, ఆవనూనె ధర రూ.140 నుంచి రూ.181కి, వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి రూ.184కి పెరిగింది. దీంతో సామాన్య ప్రజలతోపాటు రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల యజమానులు, చిరుతిళ్ల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడంతోపాటు దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడం, ద్రవ్యోల్బణం అధికమవడమే ఇందుకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతానికి ఎగబాకి 9 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో వంట నూనెల ధరలతోపాటు కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయి.
దిగుమతి సుంకాలు భారీగా పెంపు
కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, శుద్ధి చేసిన వంట నూనెలపై 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలు వరుసగా 10.6%, 16.8%, 12.3% మేరకు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.