న్యూఢిల్లీ, అక్టోబర్ 8: బంగారం హద్దు అదుపు లేకుండా దూసుకుపోతున్నది. రోజుకొక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర బుధవారం ఏకంగా మరో రూ.2,600 ఎగబాకింది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న విలువ మధ్యతరగతి వారికి కూడా అందనంటున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,600 ఎగబాకి రూ.1.26 లక్షలను అధిగమించింది. చివరకు రూ.1,26,600 వద్ద ముగిసింది. గడిచిన మూడు రోజుల్లోనే తులం ధర ఏకంగా రూ.6 వేలు పెరిగినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన తులం గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో పెరిగి రూ.1.26 లక్షలు పలికింది. అంతకుముందు ఇది రూ.1,23,400గా ఉన్నది.
వెండిది అదే దారి
బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి భారీగా పెరిగింది. కిలో ధర రూ.3,000 అధికమై రూ.1,57,000కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.54 లక్షలుగా ఉన్నది. సోమవారం రోజున రూ.1,57,400 రికార్డు ధరకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి హద్దులేకుండా దూసుకుపోతున్నది. అమెరికా షట్‌డౌన్ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎగబడి పుత్తడిని కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణం. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర కీలక మైలురాయి 4 వేల డాలర్లను అధిగమించింది. ఈ స్థాయికి ధరను చేరుకోవడం ఇదే తొలిసారి. స్పాట్ గోల్డ్ ధర 2 శాతం ఎగబాకి 4,049.49 డాలర్లు పలికింది. అలాగే ఔన్స్ వెండి 2 శాతం ఎగబాకి 49.07 డాలర్లకు చేరుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం వల్లనే దేశీయంగా రోజుకొక గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుండటం కూడా ధరలు దూసుకుపోవడానికి ప్రధాన కారణాలని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని తెలిపింది.
2 ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర రూ.47,650 లేదా 60.35 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2024న రూ.78,950గా ఉన్న పదిగ్రాముల ధర ప్రస్తుతం రూ.1,26,600కి చేరుకున్నది.2 2025లో కిలో వెండి రూ.67,300 లేదా 75.03 శాతం పెరిగింది. గతేడాది చివరి రోజు రూ.89,700గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.1,57,000కి చేరుకున్నది.