న్యూఢిల్లీ, నవంబర్ 12 : ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్నది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 14 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది మరి. మంగళవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతంగా నమోదైంది. నిరుడు ఆగస్టులో 6.83 శాతంగా ఉండగా.. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లో గణాంకాలు ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రిటైల్ ఇన్ఫ్లేషన్ కట్టడికి పెట్టుకున్న గరిష్ఠ సహన పరిమితి (6 శాతం)నీ తాజా గణాంకాలు దాటేశాయి. నిజానికి గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆర్బీఐ నిర్దేశించుకున్న 6 శాతంలోపే ద్రవ్యోల్బణం గణాంకాలు నమోదయ్యాయి. కానీ గత నెల మాత్రం ఆ హద్దు చెరిగిపోయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో 5.49 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం.. నిరుడు అక్టోబర్లో 4.87 శాతంగానే ఉన్నది.
అక్టోబర్లో కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, ఇతర కొవ్వు పదార్థాల ధరలు బాగా పెరిగినట్టు తాజా గణాంకాల్లో తేటతెల్లమైంది. అంతకుముందు 3 నెలల నుంచే ఈ సెగ కనిపిస్తున్నా.. సంబంధిత ప్రభుత్వ వర్గాల చర్యల లేమితో తీవ్రత పెరుగుతూపోయింది. అయితే పప్పుధాన్యాలు, గుడ్లు, చెక్కెర, ఇతర తీపి పదార్థాలు, మసాలా దినుసుల ధరలు తగ్గుముఖం పట్టినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం కిలో కూరగాయల ధర రకాన్నిబట్టి రూ.60-90 పలుకుతున్నది. పండ్ల ధరలు కిలో రూ.150-300 ఉండగా, ఆయిల్ ప్యాకెట్లు రూ.120-150 లేనిదే రావడం లేదు. ఇక కిలో చికెన్ రూ.250కి అమ్ముతుండగా, డజను గుడ్లు రూ.70 పెట్టి కొనాలి. అన్ని రకాల పప్పుధాన్యాల ధరలు సైతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.120-180 మధ్యే ఉన్నాయి.
చాలాకాలం తర్వాత ఆర్బీఐ తమ ద్రవ్య విధానాన్ని కఠినం నుంచి న్యూట్రల్కు గత నెల్లోనే మార్చింది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు ఇకపై తగ్గే అవకాశాలున్నాయని అటు వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, ఇటు రుణగ్రహీతలు సంబురపడ్డారు. కానీ తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. డిసెంబర్లో జరిగే ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటు యథాతథంగానే ఉండేలా ఉన్నది. లేదంటే పెరిగేందుకూ ఆస్కారముందన్న అంచనాలు వినిపిస్తుండటం గమనార్హం.
ఈ ఏడాది సెప్టెంబర్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.1 శాతానికి పెరిగింది. అంతకుముందు నెల ఆగస్టులో ఇది మైనస్ 0.1 శాతానికే పరిమితమైంది. అయితే గనులు, తయారీ, విద్యుదుత్పత్తి రంగాల్లో మెరుగైన కార్యకలాపాలు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)ని పెంచాయని జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. కానీ ఈ జోష్ రాబోయే నెలల్లోనూ కొనసాగుతుందా? అన్న అనుమానాలు మాత్రం తీరడం లేదు. ఎందుకంటే గనుల రంగంలో వృద్ధిరేటు 0.2 శాతంగానే ఉండగా, విద్యుదుత్పత్తి 0.5 శాతంతోనే సరిపెట్టింది. తయారీలో మాత్రమే 3.9 శాతం ఉత్పాదకత రేటు కనిపిస్తున్నది. అంతేగాక క్యాపిటల్ గూడ్స్ విభాగం కార్యకలాపాలు మైనస్ 2.8 శాతంగానే ఉన్నాయి. ఇతర రంగాల్లోనూ గతంతో పోల్చితే వృద్ధి బాగా తగ్గింది. ఇక నిరుడు సెప్టెంబర్లో ఐఐపీ 6.4 శాతంగా ఉండటం గమనార్హం.
పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో తగ్గినట్టే తగ్గి మళ్లీ వరుసగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూపోయింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్పీఐ) ఒక్కసారిగా 10.87 శాతానికి చేరింది. అంతకుముందు నెల సెప్టెంబర్లో ఇది 9.24 శాతంగా ఉండగా, గత ఏడాది అక్టోబర్లో 6.61 శాతంగానే ఉన్నది. దీనికి తగ్గట్టే సీపీఐలోనూ పెరుగుదల చోటుచేసుకున్నది. ఇక నగర, పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామాల్లోనే ద్రవ్యోల్బణం సెగ ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఎన్ఎస్వో చెప్తున్నది. గత నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం రేటు 6.68 శాతంగా, పట్టణ ద్రవ్యోల్బణం రేటు 5.62 శాతంగా నమోదయ్యాయి.