Telangana | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్ని ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు వైఖరితో పారిశ్రామికరంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్కచూపులు చూసే పరిస్థితి నెలకొన్నది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలో భారీగా పారిశ్రామికవాడల అభివృద్ధి జరుగుతుండగా, మరోవైపు హైడ్రా వంటి కొత్తకొత్త వ్యవస్థలతో ప్రభుత్వమే ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేయడంతో రాష్ట్ర భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ రాష్ర్టానికైనా పెట్టుబడులు రావాలంటే ముఖ్యంగా ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం ఏర్పడాలి. ఆ తరువాత శాంతిభద్రతలు అదుపులో ఉండడం, సహృద్భావ వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలు ప్రభావితం చేస్తాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి.
పదేళ్లపాటు సజావుగా సాగిన పారిశ్రామిక రంగంలో ఓ విధమైన స్తబ్ధత నెలకొన్నది. ప్రభుత్వంలోని ప్రముఖుల ప్రతీకార రాజకీయాలకు పాల్పడటంతో అశాంతి నెలకొన్నది. విపక్ష నేతలే లక్ష్యంగా రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి విచారణలు, దర్యాప్తులు చేపట్టడంతో అలజడి వాతావరణం ఏర్పడింది. దీనికితోడు అక్రమ నిర్మాణాల పేరుతో చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పేదల గుడిసెలతోపాటు భారీ భవంతులను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంతో కొత్తగా ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేవారు వెనక్కితగ్గుతుండగా, అన్నీ సవ్యంగా ఉన్న ఇళ్లకు సంబంధించిన యజమానులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాలకు ఎంతో ప్రధానమైన సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అప్పటి ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై ప్రముఖ కంపెనీ కేన్స్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యాక అది గుజరాత్‌కు మకాం మార్చడం గమనార్హం. ముఖ్యంగా గుజరాత్లో ఇప్పటికే పలు సెమీకండక్టర్ల కంపెనీలు కొలువుదీరి అక్కడి ఎకోసిస్టం అభివృద్ధి కావడం, మన రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమకు అనుకూలంగా లేకపోవడంతో సెమీకండక్టర్ కంపెనీలు గుజరాత్‌కు క్యూ కడుతున్నాయి.
ఎగరేసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్
ఇదిలావుంటే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఏన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అభివృద్ధి వేగం పెరిగింది. ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో 100 పారిశ్రామికవాడల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఒక్కో ఇండస్ట్రియల్ పార్క్ 100 ఎకరాలకు తగ్గకుండా ఉండాలని అధికారులకు స్పష్టంచేశారు. అంతేకాకుండా కొత్త ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలైన్ల అభివృద్ధి, ఇతర నగరాలతో రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు స్పష్టమైన కార్యప్రణాళికలు ప్రకటించారు. ముఖ్యంగా గతంలో ఏర్పాటుచేసిన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్‌ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం 99 ఏళ్ల లీజుకు భూములను సరసమైన ధరలకు సమకూర్చడంతోపాటు అనేక విధాలుగా పన్నురాయితీలను ప్రకటించింది. దీంతో తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు ఏపీకి తరలిపోతున్నాయి. ఏపీలో సుస్థిర ప్రభుత్వం, కేంద్రం సహకారం పుష్కలంగా ఉండటం, శాంతిభద్రతల సమస్య లేకపోవడంతో పెట్టుబడిదారులు అక్కడివైపు చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పెట్టుబడులకు అనుకూలంగా లేదని, కక్షపూరిత రాజకీయాలతో తమకు నష్టం జరుగుతున్నదని పెట్టుబడిదారులు భయపడుతున్నారని వారు పేర్కొంటున్నారు. గత సంవత్సరకాలంగా ప్రభుత్వం ఒప్పందాల పేరుతో హడావుడి చేస్తున్నప్పటికీ వచ్చిన కంపెనీ ఒక్కటీ లేదని, దీన్నిబట్టి రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
కక్షపూరిత చర్యల వల్ల రాష్ర్టానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పెట్టుబడి పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. మన పెట్టుబడి సురక్షితమేనా? ఇక్కడ పెట్టుబడి వల్ల మనకు లాభాలొస్తాయా? అనే విషయాలు వారు ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వాలు కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన చర్యలు మాత్రమే చేపట్టాలి.
– జేడీ లక్ష్మీనారాయణ,సీబీఐ మాజీ సంయుక్త సంచాలకులు