Tariff Threat | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలొగ్గినట్టే కనిపిస్తున్నది. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని అగ్రరాజ్య అధ్యక్షుడు ఈమధ్య కాలంలో పదేపదే చెప్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కూ సుంకాల పోటు ఉంటుందని ఇటీవలి అమెరికా పర్యటనలో ప్రధాని మోదీకి ట్రంప్ నిర్మొహమాటంగా చెప్పిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న వివిధ రకాల దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించేందుకున్న అవకాశాలను అన్వేషిస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు చెప్తున్నాయి.
కార్లు, మోటర్‌సైకిళ్లు తదితర ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, కీలక ఔషధాలు, కొన్ని వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, విస్కీసహా మరికొన్నింటిపై వసూలు చేస్తున్న సుంకాలను తగ్గించే వీలుందంటున్నారు. తద్వారా అమెరికా అధిక సుంకాల నుంచి తప్పించుకోవచ్చన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం.. అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి ఇప్పటికే నిర్దేశించుకున్న సుంకాల కోత కంటే ఇంకా ఎక్కువగానే టారిఫ్‌లను తగ్గించాల్సి రావచ్చన్న అంచనాలను వారు వెలిబుచ్చుతుండటం గమనార్హం. దీంతో చాలారకాల వస్తు, సేవల దిగుమతులపై పెద్ద ఎత్తునే సుంకాలు తగ్గవచ్చని చెప్తున్నారు.
ప్రస్తుతం అమెరికా సుంకాల హెచ్చరికలు.. యావత్తు ప్రపంచ వాణిజ్యాన్నే వణికిస్తున్నాయి. ఇప్పటికే స్టాక్, కరెన్సీ, కమోడిటీ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తున్నది చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆయా దేశాలతోపాటు భారత్ సైతం అమెరికాతో స్నేహపూర్వక వాతావరణానికి ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా చైనాతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ కాలుదువ్వుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను భారత్ అందిపుచ్చుకునేందుకు చొరవ చూపాలని మెజారిటీ ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. నిజానికి గ్లోబల్ మార్కెట్లో చైనాకు చెక్ పెట్టాలంటే భారత్‌ను ప్రోత్సహించడమే మార్గమని అమెరికా సైతం భావిస్తున్నది. దీంతో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. మరోవైపు భారత్‌కు రక్షణపరమైన ఎగుమతుల్ని పెంచాలని అమెరికా చూస్తున్నది. అయితే ఇప్పుడు రష్యా నుంచే ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయి. ఫలితంగా రష్యాతో సంబంధాలు చెడకుండా ట్రంప్ మెప్పును పొందే పనిలో మోదీ సర్కారున్నట్టు చెప్తున్నారు. ఇక 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరాలని అటు అమెరికా, ఇటు భారత్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2023లో ఇది 127 బిలియన్ డాలర్లే.
పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లను మంగళవారం నుంచి విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం యూనివర్సల్ టారిఫ్‌ను రెట్టింపు చేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, అమెరికాలోకి ఎంతమాత్రం ఉపేక్షించని విధంగా మనుషుల అక్రమ రవాణా, ఔషధాల స్మగ్లింగ్ జరుగుతున్నదని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధిక సుంకాలు ఒక్కటే మార్గమని ట్రంప్ అనుకుంటున్నారు.