Petrol Prices | త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం 70-72 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందన్నారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర మూడేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2021 డిసెంబర్ తర్వాత గత మంగళవారం బ్యారెల్ ముడి చమురు 70 డాలర్ల మార్కు కంటే దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో కొనసాగుతున్న మందగమనం వల్లే క్రూడాయిల్ ధర తగ్గుతుందని తెలుస్తోంది.
ధరల తగ్గుదలకు అనుగుణంగా క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ + దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్ ఉత్పత్తి పెంచాలని కోరుతున్నది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్ వీలైనంత ఎక్కువ దిగుమతి చేసుకోవాలని చమురు సంస్థలు చూస్తున్నాయని పంకజ్ జైన్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట గత మార్చిలో కేంద్రం లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరలు రూ.2 చొప్పున తగ్గించింది. తాజాగా జమ్ముకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.