Petrol Rates | అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా కొనసాగితే త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఇటీవల కేంద్రం చెప్పింది. కానీ తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు భిన్నంగా స్పందించారు. గ్లోబల్ మార్కెట్లో ఒక రోజు క్రూడాయిల్ ధర తగ్గితే, మరుసటి రోజు పెరుగుతున్నదని కేంద్ర చమురు శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత వారం రోజులుగా గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 70 డాలర్లకు దిగువనే కొనసాగుతున్నది. బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల దిగువన కొనసాగడం 2021 డిసెంబర్ తర్వాత ఇదే మొదటి సారి. సార్వత్రిక ఎన్నికల ముంగిట మినహా కేంద్ర చమురు సంస్థలు రెండేండ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు ఫ్రీజ్ చేసేశాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒడిదొడుకులకు గురవుతున్నాయని కేంద్ర చమురు శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఒక రోజు 70 డాలర్లు పలికితే, మరొక రోజు పెరుగుతున్నదన్నారు.
2021 చివరి నుంచి కేంద్ర చమురు సంస్థలు – భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లు పెట్రోల్ ధరలు సవరించడం లేదు. 2022 ఏప్రిల్లో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ మీద రూ.2 ధర తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.72, లీటర్ డీజిల్ రూ.87.62 పలుకుతున్నది. కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయా? అన్న ప్రశ్నపై కేంద్ర చమురుశాఖ అధికారి ఇప్పుడేం చెప్పలేం అని దాటేశారు. గత వారం కేంద్ర చమురుశాఖ కార్యదర్శి పంకజ్ జైన్ స్పందిస్తూ.. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర నిలకడగా కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.