Personal Finance | ‘నా దగ్గరే కోటి రూపాయలు ఉంటేనా..?’ జేబులో కాణీ లేకున్నా ఈ ఆలోచన తెరలు తెరలుగా వచ్చి మనిషిని ఊహల్లో తేలిపోయేలా చేస్తూ ఉంటుంది. నిజంగా కోటి రూపాయలు చేతిలో ఉన్నప్పుడు తెలివిగా నిర్ణయం తీసుకోకపోతే ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. అందుకే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి.. వర్తమానం సజావుగా సాగేలా డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిపని. రూ.కోటి చేతిలో ఉంటే ఇల్లు తీసుకోవడం మంచిదా! బ్యాంకులో ఎఫ్డీ చేయడం ఉత్తమమా! ఎవరు ఏం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం..
ప్రైవేట్ కంపెనీలో పాతికేండ్లు పనిచేసి రిటైర్ అయ్యాడు రామకృష్ణ. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, కుటుంబ బాధ్యతలతో వచ్చిన జీతంలో సింహభాగం ఇట్టే ఖర్చయ్యేది. పొదుపరి కావడంతో కాస్తోకూస్తో వెనకేశాడు. దీనికితోడు ఊళ్లో ఉన్న ఆస్తి అమ్మకం ద్వారా రిటైర్ అయ్యేనాటికి కోటి రూపాయలు కండ్ల చూశాడు. ఇప్పుడు ఆ కోటి ఏం చేయాలో అరవై ఏండ్ల రామకృష్ణకు పెద్ద సవాలుగా మారింది. తనకంటూ ఒక ఇల్లు ఉండాలనే ఆలోచన వచ్చినా.. పొదుపు అదుపు తప్పుతుందని ఆ సాహసం చేయలేదు. ఈ కోటితో ఇల్లు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అంతలోనే.. ఉన్న ఒక్క కోటీ ఇంటికే పెట్టేస్తే బతకడం ఎలా? ఈ ప్రశ్న తలెత్తింది. దానికి పరిష్కారమూ ఆయనకే తట్టింది. ఈ కోటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయం తన భార్య పద్మావతితో చెప్పాడు. ఆమె పెదవి విరిచింది. రుసరుసలాడుతూ వంటింట్లోకి దారితీసింది. సొంతిల్లు ఆమె కల. ‘ఎన్నున్నా ఎందుకు దండగా! నా బతుకు కిరాయికొంపలో ముగిసిపోవాలని దేవుడు రాసిపెట్టాడు..’ అని మనసులోని బాధనంతా వెళ్లగక్కింది. ఆమె మాటలన్నీ ఓపికగా విన్నాడు రామకృష్ణ.
భోజనాల వేళ కోపంగానే వడ్డిస్తున్న పద్మావతితో ‘నేను చెప్పేది విను! ఆ తర్వాత నువ్వు ఇల్లు కొనమంటే ఇల్లే కొంటాను’ అన్నాడు రామకృష్ణ. చెప్పమన్నట్టుగా చూసింది ఆమె. ‘మన దగ్గర కోటి ఉన్నాయి. ఈ హైదరాబాద్‌లో ఇప్పుడు మనం ఉంటున్న ఇలాంటి ఫ్లాట్ కొనాలన్నా కోటికి తక్కువలో రాదు! అయినా కొన్నామే అనుకో, తర్వాత మన బతుకులు ఎలా? నాకా పింఛన్ రాదు. మరో ఆదాయమూ లేదు!’ అని ఊరుకున్నాడు రామకృష్ణ. అవునన్నట్టు తలూపింది ఆమె. మళ్లీ రామకృష్ణ భార్యకు నచ్చచెబుతున్న ధోరణిలో.. ‘అదికాదోయ్! మనమా ఇంకో పదిహేనేండ్లు బతుకుతాం. మహా అయితే ఇంకో ఐదేండ్లు! ఈ కోటి ఎఫ్డీ చేశామనుకో! నెలకు రూ.70వేలు జీతంలా వస్తుంటాయి. ఇంటి అద్దె రూ.15వేలు పోగా మిగతా దాంట్లో మనం దర్జాగా కాలం వెళ్లదీయొచ్చు. ఏడాదికో విహారానికి వెళ్లొచ్చు. పిల్లలు పండుగకు వచ్చినప్పుడు అప్పు చేయాల్సిన పని ఉండదు! రేపు నాకేమైనా అయితే.. ఆ రూ.70వేలు నీకు వచ్చేలా ఏర్పాటు చేస్తాను! నువ్వు నా దగ్గరికి వచ్చేశాక.. ఆ కోటితో పిల్లలు ఏం చేసుకుంటారో వాళ్ల ఇష్టం’ అన్నాడు రామకృష్ణ. ‘తింటున్నప్పుడు ఏంటండీ ఆ మాటలు! ఎఫ్డీ చేయడమే మంచిది అనిపిస్తుంది. ఇల్లు కొన్నా.. మనం కట్టుకుపోతామా ఏంటి?’ అంటూ శ్రీవారికి ప్రేమగా గడ్డ పెరుగు వడ్డించింది పద్మావతి. అనుకున్నట్టుగా మర్నాడే కోటి ఫిక్స్డ్ డిపాజిట్‌గా కన్వర్ట్ చేసి దర్జాగా ఇంటికి వచ్చాడు రామకృష్ణ.
అరవై ఏండ్ల రామకృష్ణ సంగతి కాసేపు పక్కన పెట్టండి. నలభై ఏండ్ల దీపక్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అంటే నప్పదనే చెప్పాలి! దీపక్‌కు బోలెడంత భవిష్యత్తు ఉంది. సంపాదించే శక్తి కూడా ఉంది. కాబట్టి, ఆయన కోటి రూపాయలతో నచ్చిన ఇల్లు తీసుకోవడం మంచిది. పైగా కోటి రూపాయలు మొత్తం ఇంటిపై పెట్టకుండా, ఓ రూ.70 లక్షలు ఇంటికి కేటాయించి, మిగతా రూ.30 లక్షలు మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఉభయతారకంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎఫ్డీ వడ్డీరేట్లు తగ్గినా దీపక్‌కు వచ్చే ఇబ్బందేం ఉండదు. గృహరుణం వడ్డీ రేటు పెరిగినా సంపాదన ఉంది కాబట్టి భారంగా పరిణమించే పరిస్థితి ఉండదు. కాలక్రమంలో ఇంటి ధర కూడా పెరుగుతుంది. ఎలా చూసినా ప్రయోజనమే! అందుకే, దీపక్ వయసులో ఉన్నవారు రూ.కోటి చేతిలో ఉంటే వెంటనే సొంతింటి కలను నెరవేర్చుకోవడం తెలివైన పని.
రూ.కోటి అకౌంట్లో ఉంటే వడ్డీ గురించి మాట్లాడటం ఏంటి? ఎంచక్కా నెలకు లక్ష ఖర్చు పెట్టుకున్నా 100 నెలలు అంటే దాదాపు ఎనిమిదిన్నరేండ్లు రాజాలా బతుకొచ్చు అనుకునే వాళ్లూ ఉంటారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి? నెలకు లక్ష ఖర్చు చేయడానికి అలవాటుపడిపోయి.. తర్వాత అకౌంట్లో చిల్లిగవ్వా లేకపోతే బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు. అదే సమయంలో, రిటైర్ అవ్వగానే పిల్లలకు డబ్బులన్నీ పంచేసి బాధ్యత తీరింది అన్నట్టుగా భావిస్తారు కొందరు పెద్దలు. కానీ, ఈ రోజుల్లో ఆర్థికంగా బలంగా ఉండటం చాలా అవసరం. కన్నబిడ్డల దగ్గర మోతాదు లేకుండా శేషజీవితం గడపాలంటే.. మీ తదనంతరమే ఆస్తిపాస్తులు పిల్లలకు చెందేవిధంగా ఏర్పాటు చేయడం విజ్ఞత అనిపించుకుంటుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..