న్యూఢిల్లీ, ఆగస్టు 20 : ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్‌తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ సమాజానికి ఒక పెద్ద సమస్యగా తయారైందని ప్రభుత్వం గుర్తించిందని, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ గేమింగ్‌పై నిషేధం విధించాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక బిల్లును లోక్‌సభలో నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుత సమాజంలో ఆన్లైన్ గేమింగ్ మనీ ఒక పెద్ద సమస్యగా తయారైందని, ప్రతీ పార్లమెంట్ సభ్యుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, పరిశ్రమ విభాగం నుంచి వచ్చే ఆదాయంలో మూడింట ఒకవంతు సంక్షేమానికి కేటాయిస్తున్నదన్నారు. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు ఎవరైనా అందిస్తే వారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చునని బిల్లు ప్రతిపాదించింది. అలాగే నిబంధనలను ఉల్లంఘించి ప్రకటలను ఇచ్చే వారికి రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఈ నిబంధనల్లో ఉన్నది.