హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్‌గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి బ్రిటన్‌కు చెందిన వన్ మోటో చేరింది. ఇప్పటికే భాగ్యనగరంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన వన్ మోటో..తాజాగా ఇక్కడ ప్లాంట్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కూడా. లండన్ కేంద్రస్థానంగా ఆడమ్ రిడ్జ్‌వే (వన్ మోటో గ్లోబల్ ప్రస్తుత సీఈవో), హరిగోవింద్లు నెలకొల్పిన స్టార్టప్ వన్ మోటో గ్లోబల్ ఇప్పటికే యూరోపియన్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాల్ని విక్రయిస్తున్నది. ఇదే సమయంలో భారత్‌లో వన్ మోటో ఇండియా పేరుతో ముజామ్మిల్ రియాజ్, సమీర్ మొయిద్దీన్లు నెలకొల్పిన స్టార్టప్ ద్వారా యూకే కంపెనీ వాహనాల్ని ప్రవేశపెడుతున్నది. వన్ మోటో గ్లోబల్ తాజా రౌండ్ నిధుల సమీకరణ సందర్భంగా కంపెనీకి 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 452 కోట్లు) విలువ ఆపాదించినట్లు సీఈవో అడమ్ రిడ్జ్‌వే ఇటీవల వెల్లడించారు. వృద్ధిలో భాగంగా ఇండియాలోని 13 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేశామని, పలు దేశాల్లో ప్రవేశానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
మూడు ఈ స్కూటర్లు…
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ రీత్యా వన్ మోటో..చకచకా 3 ఈ-స్కూటర్లను విడుదల చేసింది. నవంబర్ నెలలో ‘కమ్యూటా’, ‘బైకా’ మోడల్స్‌ను, డిసెంబర్లో ఎలక్టా బ్రాండ్ స్కూటర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఇవి రూ.1.20-2 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యాయి.
అభివృద్ధి దశలో మరిన్ని వాహనాలు
తమ అంతర్జాతీయ డిజైనర్లు, ఇంజనీర్ల బృందాలతో ప్రస్తుతం పలు కొత్త మోడల్స్‌ను అభివృద్ధి పరుస్తున్నట్లు వన్ మోటో గ్లోబల్ ప్రకటించింది. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మోడ్యులార్ డెవలప్మెంట్, అప్‌గ్రేడెడ్ బ్యాటరీ టెక్నాలజీ, మరింత సమర్థవంతమైన యాప్‌ల రూపకల్పన జరుగుతున్నదని వన్‌మోటో తెలిపింది.