ముంబై, సెప్టెంబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న సూచీలు బుధవారం మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవలు, చమురు అండ్ గ్యాస్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూచీల నష్టాలను మరింత పెంచాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరి గంటలో మదుపర్లు అమ్మకాల బటన్ నొక్కడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి.
800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 813.35 పాయింట్లు లేదా 1.08 శాతం నష్టపోయి 74,764.23 వద్దకు జారుకున్నది. గడిచిన మూడు నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 203.60 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్ఠ స్థాయి 23,431.50 వద్దకు జారుకున్నది. జూన్ 11న తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు ప్రారంభ గంటలో తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయని, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ పెరిగాయి, కానీ చివరి గంటలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ ధర మళ్లీ 101 డాలర్లు దాటడం మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.

నష్టాల బాటలో రూపాయి
ముంబై, సెప్టెంబర్ 9: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తున్నది. గత మూడు రోజుల్లో 65 పైసలు దిగజారింది. బుధవారం ఒక్కరోజే 34 పైసలు పడిపోగా.. 95.08 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర మళ్లీ 100 డాలర్లను దాటడం.. రూపీని గట్టిగానే దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం భయాలు, కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు ప్రభావితం చేసినట్టు చెప్తున్నారు. హొర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకలు భయం గుప్పిట్లో కదులుతుండటం.. రూపీని సహజంగానే నష్టపరుస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ రేటు 100.73 డాలర్లకు చేరింది. దీంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగింది.