అహ్మదాబాద్ : ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ (స్టేజ్-3)లో ఆఖరి రోజూ భారత ఆర్చర్లు అదరగొట్టారు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవీతో పాటు పారాలింపిక్స్ చాంపియన్ హర్విందర్ సింగ్ పసిడి గురి పెట్టగా మరో నాలుగు విభాగాల్లో కాంస్యాలు దక్కాయి. బుధవారం హోరాహోరీగా సాగిన కాంపౌండ్ ఫైనల్లో శీతల్.. ఐజద సీడన్ (కజకిస్థాన్)ను ఓడించింది. మొదట ఇరువురు ఆర్చర్లు 144 స్కోరు చేయగా షూటాఫ్‌లో తేలిన ఫలితంలో శీతల్ 10-9తో గెలిచింది.
ఈవెంట్ కాంస్య పోరులో మరో భారత ఆర్చర్ సరిత 141-140తో వాంగ్ హుటింగ్ (చైనా)ను ఓడించడంతో భారత్‌కు డబుల్ పోడియం దక్కింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో హర్విందర్ సింగ్-భావన జోడీ.. 6-0తో చైనాను చిత్తు చేసి గోల్డ్ కొట్టింది. రికర్వ్ మహిళల కేటగిరీలో భావన.. 6-0తో భారత్‌కే చెందిన రాజశ్రీ రాథోడ్‌ను ఓడించి కాంస్యం సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శీతల్-తోమన్ జోడీ 157-145తో సారా అల్ అహ్మద్-అబ్బాస్ (ఇరాక్)ను చిత్తుచేసి బ్రాంజ్ గెలిచింది. కాంపౌండ్ మెన్స్ విభాగంలో తోమన్ కుమార్ కాంస్యం నెగ్గాడు.