హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మూడోరోజే ప్రతిపక్ష సభ్యులందరినీ మూకుమ్మడిగా బయటకు పంపింది. నిరసన తెలుపుతున్నారనే నెపంతో సమావేశాలు ప్రారంభమైన 40 నిమిషాల్లోనే బహిష్కరణ వేటువేసింది. మొత్తం 27 మంది ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
అధికార పక్షాన్ని నిలదీసే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దీటుగా ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం.. సస్పెన్షన్ అస్త్రాన్ని ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించడానికి బదులుగా ప్రతిపక్షం గొంతునొక్కిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష సభ్యులు లెవనెత్తే ప్రశ్నలకు బదులివ్వడం చేతగాక అధికార కాంగ్రెస్ తోకముడిచిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం కోరినన్ని రోజులు సభ నడుపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన సర్కార్ ఆచరణలో మాత్రం పలాయనం చిత్తగించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం.. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాపాలన? అని నిలదీస్తున్నారు.
నిరసన నెపం..పక్కా వ్యూహం
అసెంబ్లీ సమావేశమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు మూడు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హత్య చేసేందుకు ఆయన నివాసం దగ్గరకు పోలీసుల సాయంతో కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లడం, కేసీఆర్ చావు కోరుతూ డప్పులు కొట్టడం.. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగడం, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల సమస్యలపై చర్చించాలని కోరారు.
కానీ స్పీకర్ బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులందరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి వెళ్లారు. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ‘వీ వాంట్ జస్టిస్.. కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల చావు భాషపై చర్చించాలి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
రెచ్చగొట్టి..ముగ్గులోకి లాగి
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశమిచ్చారు. ఆయన బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లేందుకు యత్నించిన దళితులను అవమానించారని, వారు వెళ్లిన స్థలంలో పసుపునీళ్లతో శుద్ధి చేయించారని ఆరోపించారు. ఇందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే వారిని సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు నాగరాజు, ఆది శ్రీనివాస్, వేము ల వీరేశం. బీర్ల ఐలయ్య సైతం అడ్లూరికి వత్తాసు పలికారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్ చావును తాము కోరుకోవడంలేదని చెప్తూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శాససనభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమ శాసనసభ్యులను రెచ్చగొట్టారని ఆరోపించారు. వారే క్షమాపణలు చెప్పాలని డి మాండ్ చేశారు.
చకచకా సస్పెన్షన్ తీర్మానం..ఆమోదం..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసససభ వెల్‌లోకి వెళ్లడం.. ప్లకార్డులు ప్రదర్శించడం.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం సభా నియమావళికి విరుద్ధమని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, కే తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, విజయుడు, సంజ య్, కౌశిక్‌రెడ్డి, మాణిక్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవలక్ష్మి, అనిల్‌జాద వ్ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రతిపాదించారు. ఆ వెనువెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆమోదించారు. శ్రీధర్‌బాబు ప్రస్తావించని మల్లారెడ్డి, పద్మారావు, మహిపాల్‌రెడ్డి, గంగుల పేర్లను సైతం చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన
సస్పెన్షన్ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. ‘న్యాయం కోరితే అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారా.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం..? మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన దాడిపై ప్రశ్నిస్తే గెంటేస్తారా?’ అంటూ నినాదాలు చేశారు. ప్రజాసమస్యలపై చర్చించడం చేతగాక, తాము లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది తమ గొంతునొక్కే కుట్ర అని అభివర్ణించారు. వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలు, 22-ఏ పేరిట నిషేధిత జాబితాలో పెట్టిన భూములు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చించడం చేతగాకనే తమను సస్పెండ్ చేశారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ నుంచి గెంటేసినా పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు
ప్రధాన ప్రతిపక్ష సభ్యుల గొంతు నొ క్కి శాసనసభను అభాసుపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి విమర్శిం చా రు. తొలిరోజు గేటు బయట డ్రామా నడిపించిన కాంగ్రెస్ సర్కార్.. రెండోరోజు కేసీఆర్ పేరిట డ్రామా నడిపించిందని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ లాబీలో వారు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ పలు అంశాలను పంచుకున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ప్రతిపక్ష సభ్యులను హౌస్ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్.. కేసీఆర్ చావు కోరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. 22ఏ నిషేధిత జాబితా, జీ వో 97 అంశాలు చర్చకొస్తాయని ప్రభు త్వం భయపడుతుందని విమర్శించారు.