ముంబై, ఏప్రిల్ 13: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు విఫలంకావడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం మదుపర్లలో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒక్క శాతం వరకు నష్టపోయాయి. ఇంట్రాడేలో 1,700 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 702.68 పాయింట్లు తగ్గి 76,845.57 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ కూడా 207.95 పాయింట్లు కోల్పోయి 23,842.65 వద్దకు జారుకున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ దేశాల ప్రతినిధుల మధ్య 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకోవడం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితం కానున్నది.