ముంబై, జనవరి 30 : సార్వత్రిక బడ్జెట్‌కు ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా గడిచిన మూడు రోజులుగా భారీగా లాభపడిన సూచీలకు బ్రేక్‌పడింది. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. ఇంట్రాడేలో 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌కు బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతో చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. చివరకు వారాంతపు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 296.59 పాయింట్లు కోల్పోయి 82,269.78 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.25 పాయింట్లు కోల్పోయి 25,320.65 వద్ద స్థిరపడింది.
కేంద్ర బడ్జెట్‌కు ముందు ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయని, ఐటీ, మెటల్ సూచీలు కూడా బలహీనంగా ఉండటం పతనాన్ని మరింత పెంచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగడం, బంగారం-వెండి ధరలు తగ్గుముఖం పట్టడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని చెప్పారు. వీటితోపాటు ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను తరలించుకుపోవడం, రూపాయి పతనం కొనసాగుతుండటం పతనానికి ఆజ్యంపోసినట్టు అయిందన్నారు. రాజకీయ అస్తిరత, అంతర్జాతీయంగా టారిఫ్‌ల సెగ కొనసాగుతుండటం కూడా కారణాలని పేర్కొన్నారు.
ఈ ఆదివారం స్టాక్ మార్కెట్లు ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. 2026-27 కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ ఫిబ్రవరి 1న సూచీల ట్రేడింగ్ నిర్వహించనున్నట్టు ఎక్సేంజ్‌లు ప్రకటించాయి.