Jayshree Ullal | ప్రపంచ టెక్ రంగంలో అత్యంత సంపన్న సీఈవోలు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల (Satya Nadella), సుందర్ పిచాయ్ (Sundar Pichai). గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరూ టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్‌లుగా (Indian-origin executives in global technology) కొనసాగుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆ స్థానాన్ని వారు కోల్పోయారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి అరిస్టా నెట్వర్క్స్ (Arista Networks) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్ (Jayshree Ullal) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
హురిన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun India Rich List 2025) ప్రకారం.. టెక్ సీఈవోల్లో జయశ్రీ ఉల్లాల్ అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. రూ.50,170 కోట్ల నికర విలువతో ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల రూ.9,770 కోట్ల నికర విలువతో రెండోస్థానంలో నిలవగా.. రూ. 5,810 కోట్లతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఏడో స్థానాన్ని సరిపెట్టుకున్నారు.
పలు నివేదికల ప్రకారం.. ఉల్లాల్ 1961, మార్చి 27న లండన్‌లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. అయితే ఐదేళ్ల వయసులో ఆమె కుటుంబం భారత్‌కు వలస వచ్చేసింది. ఆమె తండ్రి ఒక భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఐఐటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. జయశ్రీ న్యూఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీలో పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం తండ్రి ఉద్యోగరీత్యా శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు జయశ్రీ.
కెరీర్ తొలినాళ్లలో పలు సంస్థల్లో పనిచేసిన జయశ్రీ.. 2008 నుంచి కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్వర్క్స్కు నాయకత్వం వహిస్తున్నారు. ఫోర్బ్స్ కథనం ప్రకారం 2024లో కంపెనీ ఆదాయం 7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం అధికం. కంపెనీ స్టాక్‌లో జయశ్రీకి దాదాపు 3 శాతం వాటా ఉంది. ఆమె నేతృత్వంలో సంస్థ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.
Also Read..
Deportation | ఈ ఏడాది అత్యధికమంది భారతీయుల్ని బహిష్కరించింది అమెరికా కాదు.. మరి ఏ దేశమో తెలుసా..?
Air Pollution | ఢిల్లీలో వెరీ పూర్ కేటరిగీలో గాలి నాణ్యత.. నగరాన్ని కమ్మేసిన పొగమంచు
Pune | పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు నిమిషాల్లో రూ.కోటి విలువైన నగలు చోరీ.. VIDEO