Deportation | అమెరికా (America) వేల సంఖ్యలో భారతీయుల్ని (Indians) బహిష్కరించిన (Deportation) విషయం తెలిసిందే. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్నారంటూ వారిని స్వదేశానికి వెళ్లగొట్టింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, అత్యధికంగా భారతీయుల్ని బహిష్కరించింది అమెరికా కాదని కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది ఎక్కువ మంది భారతీయుల్ని బహిష్కరించిన దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) అని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే రాజ్యసభ (Rajya Sabha)కు వివరాలు వెల్లడించింది. ఆ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఏడాది (2025) మొత్తం 81 దేశాలు 24,600 మందికిపైగా భారతీయుల్ని బహిష్కరించాయి. అందులో అత్యధికంగా సౌదీ అరేబియా తొలిస్థానంలో నిలిచింది. 12 నెలల్లో సౌదీ అరేబియా 11 వేల మందికంటే ఎక్కువ మంది భారతీయుల్ని దేశం నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత అమెరికా 3,800 మంది భారతీయుల్ని డిపోర్ట్ చేసింది. అమెరికాలో గత ఐదేళ్లలో ఇదే అత్యధిక బహిష్కరణలు. వాషింగ్టన్ డీసీ నుంచే 3,414 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు.
సౌదీ అరేబియా, అమెరికా తర్వాత మయన్మార్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మయన్మార్ 1,591 మంది భారతీయుల్ని గెంటేసింది. మలేషియా 1,485 మందిని, యూఏఈ 1,469 మంది భారతీయుల్ని బహిష్కరించాయి. వీసా కాలపరిమితి తీరడం, వర్క్ పర్మిట్ లేకుండా ఉద్యోగాలు చేయడం, కార్మిక నిబంధనలు వంటి కారణాలతో ఆయా దేశాలు భారతీయుల్ని బహిష్కరించాయి. బహ్రెయిన్ 764 మందిని, థాయిలాండ్ 481 మందిని, కంబోడియా 305 మందిని రిపోర్ట్ చేశాయి. ఇక భారతీయ విద్యార్థులను బహిష్కరించిన దేశాల్లో యూకే తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 170 మంది భారతీయ విద్యార్థులను యూకే డిపోర్ట్ చేసింది. ఆస్ట్రేలియా 114 మందిని, రష్యా 82 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించింది.
Also Read..
Gold Price | ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన కిలో వెండి ధర.. లక్షన్నరకు చేరువలో బంగారం
CWC Meeting | ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన శశి థరూర్
Pune | పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు నిమిషాల్లో రూ.కోటి విలువైన నగలు చోరీ.. VIDEO