ముంబై, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ తొలిసారి 25,000 మార్కును అధిగమించింది. గురువారం 59.75 పాయింట్లు లేదా 0.24 శాతం పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 25,010.90 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 25,078.30 స్థాయిని తాక డం గమనార్హం. నిఫ్టీకి ఇదే ఆల్‌టైమ్ ఇంట్రా-డే హై. ఇక బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 126.21 పాయింట్లు లేదా 0.15 శాతం పుంజుకొని ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పుతూ 81,867.55 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలోనైతే 82,000 మార్కును దాటి గతంలో ఎన్నడూలేనివిధంగా 82,129.49 స్థాయిని అందుకోవడం విశేషం.
సెప్టెంబర్‌లో వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి రావడం.. మదుపరులను పెట్టుబడులవైపునకు నడిపించింది. ఈ క్రమంలోనే యుటిలిటీస్, పవర్, చమురు-గ్యాస్, మెటల్ రంగాల షేర్లు పరుగులు పెట్టాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 0.70 శాతం, మిడ్‌క్యాప్ 0.80 శాతం చొప్పున పెరిగాయి. ఒకానొక దశలో మిడ్‌క్యాప్ సూచీ ఆల్‌టైమ్ హై స్థాయికి వెళ్లింది. షేర్లవారీగా చూస్తే.. పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్ సెజ్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పెద్ద ఎత్తున లాభపడ్డాయి.
ప్రధాన ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. అయితే దక్షిణ కొరియా సూచీ లాభపడింది. మరోవైపు ఐరోపా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ అమెరికా ఫెడ్ రిజర్వ్ జోష్‌తో భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకోగలిగాయి.