Stock Markets | ముంబై, జూలై 20: దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న సూచీలు గురువారం మరో శిఖరానికి చేరుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తుండటం, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు మదపరుల నుంచి లభించిన మద్దతుతో వరుసగా ఆరోరోజు సూచీలు కదంతొక్కాయి. రూపాయి కూడా బలపడటం మార్కెట్లకు మరింత జోష్ పెంచింది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 474.46 పాయింట్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 67,571.90 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన సూచీ చివర్లో ఈ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 వేల పాయింట్లకు చేరువైంది. వరుసగా ఆరోరోజు గురువారం కూడా సూచీ 146 పాయింట్లు అందుకొని రికార్డు స్థాయి 19,979.15 వద్ద స్థిరపడింది. కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలు మార్కెట్లకు బూస్ట్నిస్తున్నాయని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉండటంతో విదేశీ మదుపరులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు.
రెండో విలువైన సంస్థగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరో మైలురాయికి చేరుకున్నది. రెండో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. ఇప్పటి వరకు రెండోస్థానంలో కొనసాగిన టీసీఎస్‌ను వెనక్కినెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది. హెచ్డీఎఫ్సీ ద్వయం విలీనమైన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎంక్యాప్) రూ.12,72,718. 60 కోట్లకు చేరుకున్నది. ఇది టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.12,66, 891.65 కోట్ల కంటే రూ.5,826. 95 కోట్లు అధికం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర పెరగడం, టీసీఎస్ షేరు పడిపోవడం ఇందుకు కారణమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.17,72,455.70 కోట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నది.
P1