Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వారంలో నాలుగవ రోజైన గురువారం లాభాలతో ప్రారంభమైన టేడ్రింగ్ ప్రారంభమైనా.. జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయాయి. 30 షేర్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 1046 పాయింట్లు పతనమై.. చివరకు 51,496 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 332 పాయింట్లు కోల్పోయి.. 15,344 కనిష్ట స్థాయికి పడిపోయింది. సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి మధ్య సూచీలు 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. మార్కెట్ల పతనంతో రూ.5లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయారు.
అంతకుముందు, బీఎస్ఈ సెన్సెక్స్ 506 పాయింట్లు పెరిగి 53,048 ట్రేడింగ్ మొదలైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,835 వద్ద ట్రేడింగ్ షురూ అయ్యింది. మార్కెట్ ప్రారంభించే సమయానికి దాదాపు 1437 షేర్లు పెరగ్గా.. 250 షేర్లు పతనమయ్యాయి. వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఓఎన్జీసీ నష్టాల్లో కొనసాగగా.. హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో ముగిశాయి. మెటల్ ఇండెక్స్ ఐదుశాతానికిపైగా క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండు శాతానికిపైగా నష్టపోయాయి.