Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వందశాతం ప్రతీకార సుంకాలు ప్రకటించారు. ఈ క్రమంలో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు, హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం సందర్భంగా మార్కెట్లు చివరిదశలో కోలుకున్నాయి. దాంతో భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,049.16 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో గరిష్టంగా 82,438.50 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్.. 82,043.14 కనిష్టానికి చేరింది. చివరి గంటలో కొనుగోళ్లతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. చివరకు 173.77 పాయింట్లు పతనం కావడంతో సెన్సెక్స్ 82,327.05 వద్ద ముగిసింది.
నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 25,227.35 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పతనం కాగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మెటల్, టెలికాం, ఐటీ, ఎఫ్ఐఎంజీ, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.5-ఒకశాతం మధ్య పడిపోయాయి. దాదాపు 1619 షేర్లు లాభపడగా.. 2,478 షేర్లు క్షీణించాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, నెస్లే, హెచ్‌యూఎల్ నిఫ్టీలో ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నిప్పాన్ లైఫ్ ఇండియా, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎటర్నల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ వంటి 150కి పైగా స్టాక్‌లు ఈఎస్ఇలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి.