ముంబై, ఏప్రిల్ 19: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు తోడవడంతో వరుసగా నాలుగు రోజులు భారీగా పతనమైన సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 599.34 పాయింట్లు ఎగబాకి తిరిగి 73 వేల పాయింట్ల పైన 73,088.33 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 672 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే మరో సూచీ నిఫ్టీ సైతం 151.15 పాయింట్లు అందుకొని 22,147 వద్ద స్థిరపడింది. మధ్యాహ్నాం వరకు నష్టాల్లో ట్రేడైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా పుంజుకున్నాయి.
రోజు రోజుకు సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుకుంటున్నది బంగారం. శుక్రవారం బంగారం ధర మరో రికార్డు స్థాయి రూ.74 వేల మార్క్‌ను అధిగమించింది. ఈ రికార్డుకు చేరుకోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మరో రూ.400 అందుకొని రూ.74,100కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి రూ.100 అందుకొని రూ.86,600 పలికింది. ఇటు హైదరాబాద్‌లో రూ.540 పెరిగిన 24 క్యారెట్ పుత్తడి ధర రూ.73,800 నుంచి రూ.74,340కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ ధర రూ.500 అందుకొని రూ.68,150 పలికింది. వెండి మాత్రం రూ.90 వేల వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,390 డాలర్లకు చేరుకున్నది.