Stock Market | ఎన్ నిఫ్టీ 20,200 పాయింట్ల కొత్త రికార్డుస్థాయికి చేరిన తర్వాత అనూహ్యంగా భారీ కరెక్షన్ లోనయ్యింది. గత వారం 518 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద ముగిసింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ మరోదఫా వడ్డీ రేటును పెంచిన తర్వాత వచ్చే ఏడాది 4సార్లు రేట్లను తగ్గించవచ్చన్న సంకేతాల్ని యూఎస్ ఫెడ్ కమిటీ గత సమీక్షా సమావేశంలో వెల్లడించగా, గతవారం జరిగిన సమీక్షలో మార్కెట్ షాకిచ్చే సంకేతాలిచ్చింది. ఈ ఏడాది చివర్లో ఒకసారి, వచ్చే ఏడాది ప్రారంభంలో మరోదఫా రేట్లను పెంచి, అటుతర్వాత రెండు మాత్రమే వడ్డీ కోతలు ఉంటాయన్న ఫెడ్ సిగ్నల్స్ మార్కెట్లో పెద్ద కుదుపునకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కీలకమైన 20 డీఏంఏ మద్దతు రేఖను నిఫ్టీ కోల్పోయినందున, టెక్నికల్ బౌన్స్ నిలదొక్కుకోలేవని, కొద్ది రోజులు మార్కెట్ కరెక్షన్ బాటలోనే ఉంటుందని ఈక్విటీరీసెర్చ్. ఆసియా వ్యవస్థాపకుడు వైష్ణవ్ అంచనా వేశారు.
సమీప మద్దతు 19,500
ఈ వారం నిఫ్టీకి సమీప మద్దతుస్థాయి 19,500 పాయింట్ల వద్ద ఉన్నదని, ఇది కోల్పోతే, తదుపరి మద్దతు 19,380 పాయింట్ల వద్ద పొందవచ్చని, షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగితే 19,850, 19,990 స్థాయిలు అవరోధం కల్గించవచ్చని వైష్ణవ్ అంచనా వేశారు. 20 డీఎంఏను నిఫ్టీ వదులుకున్నందున, సెంటిమెంట్ బేరిష్ మారిందని ఎల్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ కునాల్ షా చెప్పారు. 19,900 దిగువన కొనసాగినంతకాలం మార్కెట్ పెరిగితే అమ్మకాలు వెల్లువెత్తుతాయని, ఈ వారం 19,550-19,500 శ్రేణి వద్ద తాత్కాలిక మద్దతు పొందవచ్చని కునాల్ షా అంచనా వేశారు.