న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభంలో 5 శాతం క్షీణించింది. ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్ వ్యాపారంలో ఆశించిన స్థాయిలో రాణించకపోకపోవడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.17,394 కోట్ల (ప్రతి షేరుకు రూ.25.71) నుంచి రూ.16,563 కోట్ల (ప్రతిషేరుకు రూ.24.48)కి పడిపోయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.2.38 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్నది. రిటైల్, టెలికం రంగాలు నిలకడైన పనితీరు కనబరిచినప్పటికీ చమురు నుంచి టెలికం వర్టికల్ మాత్రం నిరాశాజనక పనితీరు కనబరిచాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. క్రూడాయిల్, శుద్దిచేసిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు.
లాభాల్లో జియో జోరు
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో లాభాల జోరు కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,539 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 23.4 శాతం వృద్ధిని కనబరిచింది. సరాసరిగా ఒక్కో కస్టమర్‌పై వచ్చే ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి చేరుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.31,709 కోట్లకు చేరుకున్నది. టారిఫ్ ధరలు పెరగడం సంస్థకు కలిసొచ్చింది. రెండేండ్ల క్రితం సంస్థ ప్రారంభించిన 5జీ సేవలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, ప్రస్తుతం 14.8 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ప్రస్తుతం జియోకు 47.8 కోట్ల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఉన్న 48.97 కోట్ల మందితో పోలిస్తే తగ్గగా, ఏడాది క్రితం ఉన్నవారితో పోలిస్తే భారీగా పెరిగారు.